
ఉర్దూ పోస్టులు తీసేయడం సబబు కాదు
వైఎస్సార్ టీచర్ల ఫెడరేషన్ జిల్లా
అధ్యక్షులు బొజ్జా సురేష్
పర్చూరు(చినగంజాం): టీచర్ల బదిలీల్లో తెలుగు మీడియం పాఠశాలల్లో ఉర్దూ సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులను తీసేయడం సబబుకాదని బాపట్ల జిల్లా వైఎస్సార్ టీచర్ల ఫెడరేషన్ అధ్యక్షులు బొజ్జా సురేష్ తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన టీచర్ల బదిలీ జాబితా ప్రకారం ఉర్దూ మీడియం పాఠశాలల్లో కొన్ని పోస్టులను తీసివేసి తెలుగు పోస్టులను ఉంచినట్లు పేర్కొన్నారు. తెలుగు మీడియం పాఠశాలల్లో ఉన్న ఉర్దూ ఎస్జీటీ పోస్టులను తీసివేశారన్నారు. ఈ విధంగా చేయడం వల్ల జిల్లాలో ఉర్దూ భాష మరుగున పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఎస్‌జీటీ(తెలుగు) పోస్టులను అడిషనల్ పోస్టులుగా చూపించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ విద్యార్థులను, వారి భాషను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఉర్దూ ఎస్జీటీ పోస్టులను యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు.
జనసేన కన్వీనర్
రాజేష్‌కు నోటీసు
చావలి(వేమూరు): జనసేన నియోజకవర్గ కన్వీనర్ ఊసా రాజేష్ దళిత వర్గానికి చెందిన కొండయ్యను చెప్పుతో కొట్టి పార్టీ నియమావళి ఉల్లఘించినందుకు నోటీసు జారీ చేసినట్లు పార్టీ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంటు హెడ్ వేములపాటి అజయ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాడిపై లిఖితపూర్వకంగా 48 గంటల్లో కేంద్ర కార్యాలయంలో సమర్పించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. విచారణ చేసిన తర్వాత చర్యలను పార్టీ తీసుకుంటుందని తెలిపారు. దళితలపై జన సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
నదిలో దూకి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ పైనుంచి ఓ వ్యక్తి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానది సీతానగరం వైపు ప్రకాశం బ్యారేజ్ 6వ ఖానా వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణానది నీటి స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన గేటుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉంటుంది. మృతుడి శరీరంపై నల్ల జీన్స్ ఫ్యాంట్, నల్లని చొక్కా ధరించి ఉన్నాడు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే 8008443915 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌ఐ కోరారు.