వేటపాలెం: మండలంలోని పందిళ్లపల్లి శివారు పంట పొలాల్లో ఉన్న గ్రామ దేవత పందిళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు దేవస్థానం ముందు వైపుగల కటకటాల తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. హుండీని కూడా పగలగొట్టి అందులోని నగదు, బీరువాని తెరచి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారని ఎస్‌ఐ ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చోరీకి గురైన మొత్తం విలువు రూ.30 వేలు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
బల్లికురవ: కుంటుంబ కలహాలతో ఓ వివాహిత ఎలుకల మందు పేస్టు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మండలంలోని చిన అంబడిపూడిలో జరిగింది. 108 సిబ్బంది, స్థానికుల సమాచారం మేరకు.. చిన అంబడిపూడి బీసీ కాలనీకి చెందిన పల్లపు అనూష ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనూష ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్కూటీని ఢీ కొట్టిన లారీ
వ్యక్తి మృతి
వేటపాలెం: వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మతి చెందాడు. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం దగ్గరలో సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల మేరకు... చీరాలకు చెందిన రాజు కృష్ణారెడ్డి(61) స్కూటీపై వేటపాలెం పని నిమిత్తం వచ్చాడు. పని ముగించుకుని రాత్రి తిరిగి బైపాస్ రోడ్డు మీదగా చీరాల బయలు దేరాడు. అక్కాయిపాలెం జంక్షన్ దగ్గరలో చీరాల వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. త్రీవ గాయాలతో ఉన్న వ్యక్తిని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో
పరస్పర దాడులు
చీరాల: మద్యం మత్తులో ఇరువురు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన ఆదివారం చీరాలలో చోటుచేసుకుంది. శ్రీకాంత్, ప్రశాంత్ ఇద్దరు బంధువులు. ఆదివారం మద్యం తాగి ఇద్దరు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో శ్రీకాంత్‌కు గొంతులో కత్తి గుచ్చుకుంది. చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించారు. ప్రశాంత్ చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు అవుట్ పోస్టు పోలీసులు వివరాలను నమోదు చేశారు.
యువకుడిపై కత్తితో దాడి కేసులో నిందితుడి అరెస్టు
రేపల్లె రూరల్: యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి ఆదివారం కోర్టుకు హాజరు పరిచినట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పట్టణంలోని 7వ వార్డుకు చెందిన దేవరకొండ కోటేశ్వరరావు అదే వార్డుకు చెందిన దేవరపల్లి నవీన్ కుమార్‌పై ఈనెల 26న కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు నవీన్ కుమార్ తల్లి స్వరూపరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడు కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు చెప్పారు.
పందిళ్లమ్మ గుడిలో చోరీ


