
హరినాధుడికి పొంచి ఉన్న ముప్పు
● గతంలోనే దెబ్బతిన్న కల్యాణ మండపం ● మాడ వీధుల విస్తరణతో మరింత ప్రమాదం ● అభివృద్ధి ప్లాన్‌లో చేర్చితే ఆలయానికి ఆదరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూత వేటు దూరంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయానికి ముప్పు పొంచి ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ గుడి రామాలయానికి ఉత్తర దిక్కులోని గుట్టపై ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 100 ఏళ్ల క్రితమే నిర్మించినట్లుగా చెబుతుండగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో ఈ ఆలయ అభివృద్ధిని సైతం రామాలయ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చాలని, తద్వారా భక్తుల, పర్యాటకుల రాక పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మాడ వీధులు విస్తరిస్తే..
రామాలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణకు ఇటీవల ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు నిర్వాసితులకు రూ.34 కోట్ల నష్ట పరిహారం కూడా అందజేసింది. ఇక వారి నుంచి భూమి తీసుకోవడమే మిగిలి ఉంది. మాడ వీధుల విస్తరణకు సేకరించే భూమి వెనుక భాగంలో ఉన్న గుట్టపైనే ఈ కుసుమ హరినాధ ఆలయం ఉంది. గతంలోనే ఈ గుట్టను ఆక్రమించి కొంతమేర నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడా స్థలాల్లో అభివృద్ధి పనులు చేస్తే గుట్ట కింది భాగం కొద్దిమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి తోడు శతాబ్దం క్రితం నిర్మించిన ఆలయం కావడంతో ప్రాభవం లేక పురాతనంగా మారింది. గుట్టపై భాగంలో ఆలయం వద్ద ఉన్న కల్యాణ మండపం సైతం ఇటీవల కుంగి కొంత పడిపోయింది. గతంలో రథసప్తమి రోజున ఈ మండపంలోనే కుసుమ హరినాధుల కల్యాణం నిర్వహించేవారు. అది పూర్తిగా శిథిలం కావడంతో ప్రస్తుతం ఆలయంలోనే జరిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆలయం చెంతన అభివృద్ధి పనులు చేపడితే మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆలయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి..
దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయాన్ని ప్రమాదం నుంచి తప్పించడంతో పాటు భక్తుల రాక పెంచేలా రామాలయ అభివృద్ధి ప్రణాళికలో దీన్ని కూడా భాగం చేయాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా రామాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు ఈ దేవస్థానాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రంగనాయకుల గుట్టపై ఉన్న కాటేజీలు, రామదాసు జ్ఞాన మందిరం, రంగనాధ స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఇటువైపు నుంచి మార్గం దగ్గరవుతుంది. రామాలయానికి వచ్చే భక్తులు ప్రస్తుతం అక్కడికే పరిమితమవుతున్నారు. ప్లాన్‌లో చేర్చి దీన్ని కూడా అభివృద్ధి చేస్తే శివాలయం, కుసుమ హరినాధాలయం, రంగనాయకుల ఆలయాలు సైతం భక్తులకు చేరువవుతాయి. ఇక పడమర దిక్కున ఉన్న నరసింహస్వామి వారి ఆలయానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన గత మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారు. దీన్ని తీగల వంతెనగా మార్చి నరసింహాలయం, అటు నుంచి గోదావరి వరకు నిర్మిస్తే నేరుగా ఉపాలయానికి, అక్కడి నుంచి గోదావరి కరకట్ట వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భద్రాచలానికి కొత్త సొబగులు చేకూరే అవకాశం ఉంటుంది.
ప్రతిపాదనలు పంపాం
ఇటీవల పడిపోయిన కల్యాణ మండపం, శిథిలావస్థకు చేరుకున్న ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రమాద పరిస్థితుల నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని నివేదికలో కోరాం.
– సుదర్శన్, ఈఓ, కుసుమ హరినాధాలయం