
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బాధ్యతలు స్వీకరించిన జడ్జి కవిత
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన కర్నాటి కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నరగా ఈ పోస్టు ఖాళీగా ఉండగా హైదరాబాద్ నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి బదిలీపై వచ్చిన కవిత నియమితులయ్యారు. భాద్యతల స్వీకరణ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.
నేడు పెద్దమ్మగుడి
పాలకవర్గ ప్రమాణ స్వీకారం
పాల్వంచరూరల్ : ఎట్టకేలకు పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 19న పాలకమండలి జాబితాను ప్రభుత్వం జారీ చేయగా.. స్ధానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ కొందరు అందోళన చేయడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తుతో నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని ఈఓ వెల్లడించారు.
మే 1 నుంచి
ఉపాధ్యాయులకు శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: మే 1వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా సోమవారం హైదరాబాద్ నుంచి జూమ్ సమావేశం నిర్వహించగా జిల్లా నుంచి డీఈఓ హాజరయ్యారు. అనంతరం వివిధ విభాగాల కో – ఆర్డినేటర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పాఠశాల పని దినాలు నష్టపోకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా, మండల రిసోర్స్ పర్సన్ల ఎంపికకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో కూడా కొనసాగించాలని ఆదేశించారు. పీఎంశ్రీకి ఎన్నికై న పాఠశాలలకు విడుదలైన నిధుల వినియోగంపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమంలో భాగంగా బడిబాటను విజయవంతం చేయాలని, ఇందుకోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు ఎ.నాగరాజ శేఖర్, ఎస్‌కే సైదులు, జె.అన్నామణి, ఎఫ్‌ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం..
మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీ లోపు నిర్ణీత నమూనాలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ