
కారులన్నీ అటే...
నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
● అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీలో తగ్గిన జోష్ ● ఏడాదిన్నరగా స్తబ్ధుగా ఉన్న పార్టీ శ్రేణులు ● నైరాశ్యాన్ని తొలగించిన వేడుకలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు భారత రాష్ట్ర సమితికి కొత్త ఊపు తెచ్చాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గత 15రోజులుగా శ్రమిస్తున్నారు. 2023 సాధారణ ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్ ఈ వేడుకలతో ఉత్సాహంగా పని చేస్తోంది.
అప్పుడు గులాబీమయం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లోనూ ఇక్కడ బీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే పది అసెంబ్లీ స్థానాల్లో ప్రతీ సారి ఒక్కోచోట మాత్రమే బీఆర్‌ఎస్ గెలిచింది. జిల్లాలో 2014 ఎన్నికల్లో కొత్తగూడెం, 2023లో భద్రాచలం స్థానాల నుంచి కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ప్రతీసారి కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తూ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఏ చిన్న పిలుపు ఇచ్చినా.. ఊరువాడా అంతా గులాబీ మయంగా మారిపోయేది.
తగ్గిన జోరు..
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఐదు స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన మూడు చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో ఆ పార్టీ మద్దతుతో సీపీఐ విజయం సాధించాయి. భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో అటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్ స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంతకుముందే ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో పట్టణాల్లోనూ పార్టీ ఊపు తగ్గింది. దాదాపు ఏడాది కాలంగా పార్టీ తరఫున చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కూడా జరగలేదు. అంతకుముందు పదేళ్ల పాటు ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగగా.. మారిన పరిస్థితులతో బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే నేతల సంఖ్య పెరిగింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికై నా పార్టీలో పూర్వపు జోష్ వస్తుందా రాదా అనే సందేహాలు నెలకొన్నాయి.
సన్నాహక సమావేశాలతో..
పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, దీనికి భారీగా జన సమీకరణ చేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ నాయకులు తిరిగి జనాల్లోకి రావడం మొదలైంది. వార్డులు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, నియోజకవర్గాల వారీగా నేతల ను సమన్వయం చేశారు. ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన సైతం వేర్వేరుగా ఉన్న నేతలను ఒక్క తాటిపైకి తెచ్చింది. ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు జన సమీకరణపై దృష్టి సారించారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలతో తిరిగి గులాబీ జెండాలను రెపరెపలాడించారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ కావడంతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఈ వేడుకల్లో వెల్లడవుతుందనే నమ్మకం కేడర్‌లో నెలకొంది. దీంతో గ్రామ, మండలస్థాయి నుంచి పార్టీ నేతలంతా వరంగల్ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా రజ తోత్సవాలు బీఆర్‌ఎస్ కేడర్‌లో నెలకొన్న నిస్తేజాన్ని దూరం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సభను విజయవంతం చేయాలి..
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతంలో పాలు పంచుకోవాలి. జనం వెళ్లేలా బస్సులు, కార్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌కే సాధ్యమైంది. ఇది రజతోత్సవ సభగానే కాక రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంగా ఉంటుంది.
– పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి
ఖమ్మం సత్తా చాటుదాం..
కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఈ నేపథ్యాన ఎల్కతుర్తి సభకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరై కేసీఆర్‌కు మద్దతు ప్రకటించాలి. ఇక్కడి నుంచి అత్యధికంగా జనం వెళ్లడం ద్వారా జిల్లా సత్తా చాటాలి.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు

కారులన్నీ అటే...

కారులన్నీ అటే...