
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాంతి చర్చల ప్రక్రియపై మావోయిస్టు పార్టీ నార్త్–వెస్ట్ సబ్ జోనల్ ఇన్‌చార్జ్ రూపేశ్ తరచూ స్పందిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. రూపేశ్ పేరుతో ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరిగా ముద్రపడిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అని పలువురు అనుమానిస్తున్నారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న అలియాస్ రూపేశ్ పేరుతో ఆయన కొనసాగుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట ఆయన స్వస్థలం. హనుమకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989 లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అప్పటి పీపుల్స్ వార్ గ్రూపు చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నాడు.
‘అలిపిరి యాక్షన్’టీమ్ లీడర్
ఉమ్మడి ఏపీలో అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్‌కేసర్ దగ్గర 2000 మార్చి 7న బాంబు పేల్చి చంపిన ఘటనతో ఆశన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు కొద్దిరోజుల ముందే హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ చౌరస్తాలో 1999 సెప్టెంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను దారి కాచి కాల్చి చంపిన టీమ్‌లోనూ ఆశన్న ఉన్నారు.
వీటన్నింటికీ మించి 2003 అక్టోబర్‌లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన టీమ్‌కి ఆశన్నే నాయకత్వం వహించాడు. ఈ ఘటనతో తక్కెళ్లపల్లి వాసుదేవరావు పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలిపిరి ఘటన తర్వాత ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)కి ఆశన్న వెళ్లారు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు 2017లో వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నార్త్–వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.