
భూ భారతితో రైతులకు మేలు
దుమ్ముగూడెం/చర్ల : భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం గంగోలు, చర్ల మండల కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న లోపాలను సరి చేస్తూ నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. రైతులు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వారసత్వ హక్కులతో పాటు సాదాబైనామాను సులభంగా చేసుకోవచ్చన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి సమస్యలకు ఈ చట్టం పరిష్కారం చూపుతుందని వివరించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు, ఏడీఈ సుధాకర్‌రావు, తహసీల్దార్లు అశోక్‌కుమార్, ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఓలు నవీన్‌కుమార్, లావణ్య, ఏఎంసీ చైర్మన్‌లు ఇర్పా శ్రీను, తెల్లం సీతమ్మ, పీఏసీఎస్ చైర్మన్‌లు కిలిమి ఎల్లారెడ్డి, పరుచూరి రవికుమార్, మందపాటి అచ్యుత శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి