
ఆర్థిక అవగాహన ఉండాలి
ఆర్‌బీఐ మేనేజర్ సాయితేజ రెడ్డి
గుండాల : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలని ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ సాయితేజ రెడ్డి అన్నారు. యాస్పిరేషనల్ బ్లాక్ గుండాల మండలం కాచనపల్లిలో శుక్రవారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక ప్రణాళిక, పొదుపు, వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంక్ లావాదేవీలపై అవగాహన ఉండాలని, ఆన్‌లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, కాచనపల్లి ఎస్బీఐ మేనేజర్ వేణు, కోటేశ్వర రావు, నాగేశ్వర రావు, జగ్యా తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 20వ తేదీ నుంచి మొదలైన సార్వత్రిక పీఠం ఓపెన్ ఇంటర్, పదో తరగతి ఽథియరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, శనివారం నుంచి ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టీకల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
‘మిషన్ భగీరథ’ను పరిశీలించిన సీఈ
అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్‌ను, మిట్టగూడెం రథంగుట్ట వద్ద వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను శుక్రవారం మిషన్ భగీరథ సీఈ కే.శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవల ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో సమ్మక్క–సారక్క బ్యారేజీ నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఈ సందర్శించి నీటిమట్టాన్ని పరిశీలించారు. మే నెల వరకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, ఈఈ నళిని, డీఈ మహేందర్ పాల్గొన్నారు.
మలేరియా నివారణ ర్యాలీ
కొత్తగూడెంఅర్బన్: మలేరియాను నివారించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ముర్రేడువాగు నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం సర్వజన ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌ను సందర్శించి, సేవలపై ఆరా తీశారు. వైద్యాధికారులు సుకృత, బాలాజీనాయక్, మధువరన్, ఫయాజ్‌మొహియుద్దీన్, జేతు, హరికిషన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
అర్హులనే ఎంపిక చేయాలి
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులనే ఎంపిక చేయాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం దమ్మపేట మండలం అల్లిపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హుల ధ్రువీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అన్నారు. దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నారంవారిగూడెం కాలనీ పంచాయతీలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు రవీంద్రా రెడ్డి, రామారావు, స్పెషల్ ఆఫీసర్ జుంకీలాల్, ఎంపీఓ సోయం ప్రసాద్, ఇతర అధికారులు రంజిత్ కుమార్, అక్షిత, శ్రీనివాస్, శివరాంప్రసాద్, రామకృష్ణ, మురళి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక అవగాహన ఉండాలి

ఆర్థిక అవగాహన ఉండాలి