
మహిళా ఉత్పత్తులకు విశేష ఆదరణ
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం) : హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో జిల్లా మహిళల ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. గతంలో కలెక్టర్ ఆలోచన మేరకు ‘రన్ ఫర్ హర్‘ కార్యక్రమంలోనూ జిల్లా మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో మరింతగా ప్రేరణ పొందిన మహిళలు.. ఇప్పుడు భారత్ సమ్మిట్‌లో ఉత్పత్తులను ప్రదర్శించారు. డీఆర్‌డీఏ నుంచి మహిళా సమాఖ్య సభ్యులు హాజరై పిండివంటల, వెదురు, సిమెంట్‌తో చేసిన గదలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించగా మంచి స్పందన లభించిందని డీఆర్‌డీఏ డీపీఎం నాగజ్యోతి తెలిపారు.
చెక్ బౌన్స్ కేసుల
పరిష్కారానికి లోక్ అదాలత్
కొత్తగూడెంటౌన్: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14 వరకు జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్లు, ఆర్థిక సంస్థల ఆధికారులతో ఈనెల 29న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు, చిన్న ఆర్థిక సంస్థలు, ప్రతివాదులు సంబంధిత కోర్టులకు వెళ్లి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
నలుగురు ఎస్సైల బదిలీ
కొత్తగూడెంటౌన్: జిల్లాలో నలుగురు ఎస్సైలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుండాల ఎస్సై సీహెచ్ రాజమౌళిని వీఆర్ కింద జిల్లా కార్యాలయానికి, అశ్వాపురం ఎస్సై ఎండీ సైదా రహుఫ్‌ను గుండాలకు, భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మధు ప్రసాద్‌ను ఆశ్వాపురానికి, అక్కడి ఎస్సై టి.తిరుపతిరావును భద్రాచలం ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
కొత్తగూడెంలో
ఏసీబీ సోదాలు
కొత్తగూడెంఅర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరు ఇన్ చీఫ్ హరిరామ్ సొంత ఇల్లు లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో ఉండగా, శనివారం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరిరామ్ బంధువుల ఇళ్లలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో కూడా తనిఖీలు జరిపారు. కాగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని డీఎస్పీ రమేష్ వెల్లడించారు.