ఆమోద ముద్ర పడేనా? | - | Sakshi
Sakshi News home page

ఆమోద ముద్ర పడేనా?

Published Thu, Apr 24 2025 12:41 AM | Last Updated on Thu, Apr 24 2025 12:41 AM

ఆమోద ముద్ర పడేనా?

ఆమోద ముద్ర పడేనా?

‘సీతారామ’పై నేడు ఢిల్లీలో టీఏసీ సమావేశం
● ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించనున్న టెక్నికల్‌ కమిటీ ● గత ఫిబ్రవరిలోనే జారీ కావాల్సిన అనుమతులు ● ఇప్పటికై నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే, బరాజ్‌ పనుల్లో పెరగనున్న వేగం

నిలిచిపోయిన సీతమ్మ సాగర్‌ బరాజ్‌ పనులు (ఫైల్‌)

మేడిగడ్డ ప్రభావంతో..

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్‌ (లక్ష్మీ బరాజ్‌) కుంగుబాటుతో కేంద్ర జల సంఘం, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీలు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసేప్పుడు ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట వరద ప్రవాహాలు, వాటి వేగం, బరాజ్‌ నిర్మించే ప్రదేశంలో నేల స్వభావం.. వీటికి అనుగుణంగా బరాజ్‌ డిజైన్లు ఉన్నాయా.. ఇలా ప్రతీ అంశాన్ని కమిటీ సభ్యులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పైగా సీతమ్మసాగర్‌లో 282 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఈ బరాజ్‌ డిజైన్లను మరింత వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని గత సమావేశంలో టీఏసీ అభిప్రాయపడింది.

ఫిబ్రవరిలోనే రావాల్సింది..

సీతారామ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు (డీపీఆర్‌) సంబంధించిన సాంకేతిక అనుమతుల ఫైల్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 11న సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ముందుకు వచ్చింది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నాడు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, విజయభాస్కరరెడ్డి, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అశ్వాపురం మండలంలో గోదావరిపై సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నిర్మించడంతో 67 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను వారు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అనుమతులు ఇప్పటికే లభించాయని, కీలకమైన టీఏసీ అనుమతి వస్తే బరాజ్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతాయని కమిటీ సభ్యుల దృష్టికి తెచ్చారు. అయితే సీతారామ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సీతమ్మ సాగర్‌ బరాజ్‌ డిజైన్లను మరోసారి పరిశీలిస్తామని చెప్పడంతో అనుమతులకు ఆలస్యమైంది.

అనుమతుల సాధన తప్పనిసరి..

జీవ నదులపై ఏమైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే ముందుగా ఆ నదీ యాజమాన్య బోర్డు, ఆ తర్వాత కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తప్పనిసరి. ఈ రెండు చోట్లా అనుమతులు వచ్చాక సీడబ్ల్యూసీ నియమించిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పరిశీలనకు పంపాలి. ఈ కమిటీ డీపీఆర్‌ను పరిశీలించి ఆమోదం తెలిపితే ఆ ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్‌ అప్రైజల్‌ వచ్చినట్టుగా భావిస్తారు. అనంతరం కేంద్ర జల్‌ శక్తి మంత్రి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్‌ కమిటీ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంటుంది. వివాదాస్పద ప్రాజెక్టులను మినహాయిస్తే అపెక్స్‌ కమిటీ అనుమతి లాంఛనప్రాయమే.

ఆగుతూ.. సాగుతూ..

సీతారామ ఎత్తిపోతల పథకం పనులు 2016లో ప్రారంభమయ్యాయి. అనూహ్య కారణాలతో 2018లో డిజైన్లు మారాయి. దీంతో మరోసారి డీపీఆర్‌ సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా కష్టాలు కమ్ముకున్నాయి. ఎట్టకేలకు తుది డీపీఆర్‌ రెడీ చేసి 2023 జనవరి 23న టెక్నో అప్రైజల్‌ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ రిపోర్టును పరిశీలించిన కేంద్ర జల సంఘం.. సీతమ్మ సాగర్‌ బరాజ్‌లో జల విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అప్రైజల్‌ను తిరస్కరించింది. దీంతో విద్యుత్‌ కేంద్రం మినహా మిగిలిన బరాజ్‌ నిర్మాణ పనులు జరుగుతున్న తరుణంలో ఈ అంశం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లగా.. ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలంటూ 2023 మేలో ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement