
ఉద్రిక్తంగా కర్రి గుట్టల పరిసర గ్రామాలు
ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న గిరిజనం
చెట్లు, పుట్టల వెంట ఎక్కడ చూసినా భద్రతాదళాలే..
కర్రి గుట్టల ప్రాంతం మీదుగా ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రి గుట్టల ప్రాంతం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు మా వోయిస్టుల రాచబాటగా పేరున్న చర్ల–బీజాపూర్ అడవి మార్గంలో ‘సాక్షి’గురువారం ప్రయాణించింది. తెలంగాణ చివరి గ్రామమైన పూసుగుప్ప మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించి..అక్కడి నుంచి రాంపురం, బీమారం, చిన్నఊట్ల, పెద్ద ఊట్ల, కస్తూరిపాడు, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, గల్ గావ్, నడుంపల్లి, ఊసూరు, ఆవుపల్లి మీదుగా బీజాపూర్‌కు చేరే ప్రయత్నం చేసింది. ఈ మార్గం పూర్తిగా కర్రి గుట్టల పక్క నుంచే ఉంది. అక్కడి పరిస్థితులపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్...
కుప్పకూలిన జనతన సర్కార్
చిన్న ఊట్లపల్లి ఊరి చివరకు వెళ్లి కర్రి గుట్టల ఫొటోలు తీస్తుండగా, ఇద్దరు గ్రామస్తులు ఎదురయ్యారు. భద్రతాదళాల దాడులతో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని అడిగితే... ‘ఇక్కడి ప్రతీ ఊరి నుంచి ఇద్దరు, ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు. బాంబుల మోత, కాల్పుల శబ్దం వినిపించినప్పుడల్లా మావారు ఎలా ఉన్నారో అనే ఆందోళన కలుగుతుంది’అని చెప్పారు.
మాట్లాడిన ఓ వ్యక్తి గతంలో జనతన సర్కార్ గ్రామ కమిటీలో కీలకంగా వ్యవహరించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జనవరి వరకు గ్రామ పాలనలో జనతన సర్కార్ మాట నడిచేదని.. క్యాంపులు పెరగడంతో జనతన సర్కార్ కుప్పకూలిందన్నాడు.
బయటకు రావొద్దన్నారు
మూడు రోజుల కిందట క్యాంపు నుంచి జవాన్లు వచ్చి ‘రేపటి నుంచి అడవిలోకి వెళ్లొద్దు. ఇంటి నుంచి బయటకు రావొద్దు’అని చెప్పారన్నారు. సోమవారం సాయంత్రం నుంచే తమ ఊరి మీదుగా జవాన్లు కర్రి గుట్టల వైపునకు వెళ్లారని, ఇప్పుడు ఊరు చుట్టూ ఉన్న అడవిలో కూంబింగ్ పార్టీలు ఉన్నాయన్నారు.
ఊరు దాటి కొంచెం అడవిలోకి వెళ్లి జవాన్లు కనిపిస్తుండటంతో పశువులను కూడా మేతకు పంపొద్దనే సూచనలతో మూడు రోజులుగా ఇంటికే పరిమితం చేశామన్నాడు. అక్కడి వారితో మాట్లాడుతుండగానే గ్రామం మీదుగా హెలికాప్టర్ వెళ్లింది. ‘నిన్న బాంబుల శబ్దాలు వినిపించినా ఇవాళ లేవు.. మధ్యమధ్యలో బోర్ వేసినట్లు శబ్దం వస్తోంది.. అది కాల్పుల మోతే కావొచ్చు’అన్నారు.
అనుమతి లేదు
కస్తూరిపాడు దాటుకొని బీజాపూర్ వైపు వెళుతుండగా అడవి లో జవాన్లు నలుగురైదుగురు బృందాలుగా కనిపించారు. ప్రతీ గుంపు దగ్గర 20 లీటర్ల వాటర్ క్యాన్లు ఉన్నాయి. వాళ్లను దాటేసి వెళుతుండగా పూజారి కాంకేర్ వద్ద చెక్‌పోస్టు సిబ్బంది ఆపేశారు. జర్నలిస్టు ఐడీ కార్డులు చూపించినా ముందుకు వెళ్లనివ్వలేదు. ‘ఇక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నా యంటూ వెనక్కి పంపారు. అడవిలో ఏర్పాటు చేసిన ప్రతీ బేస్ క్యాంప్‌నకు మూడంచెల భద్రత ఉంది. ప్రతీచోట హెలీ ప్యాడ్లు ఉన్నాయి. చకచకా క్యాంప్‌ల నిర్మాణం చేస్తున్నారు.
ఖాళీగా గ్రామాలు
ఒకప్పుడు ఈ మార్గంలో కాలిబాటలు ఉండేవి. కొత్తగా ఏర్పాటైన బేస్ క్యాంపుల కోసం మట్టి రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్డు మీదుగా వెళ్తుండగా ముందుగా రాంపురం గ్రామం వచ్చింది. అక్కడ ఇళ్లు తప్ప.. మనుషులెవరూ కనిపించలేదు. ఆ తర్వాత వచ్చిన చిన్నఊట్లపల్లిలో పిల్లల అలికిడి వినిపించింది. ఈ గ్రామానికి పక్కనే ఉన్న పెద్ద ఊట్లపల్లి సమీప కర్రి గుట్టలో జనవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10మంది మావోయిస్టులు చనిపోయారు.
మాట కలపని మహిళలు
చిన్న ఊట్లపల్లి దాటిన తర్వాత కస్తూరిపాడులోకి వెళ్లగా ఇద్దరు మహిళలు కనిపించారు. ఎంత ప్రయత్నించినా మాట కలిపేందుకు వారు ఇష్టపడలేదు. ఇంతలో అదే గ్రామానికి చెందిన తెలుగు తెలిసిన వ్యక్తి వచ్చి ‘ఏం కావాలి’అనడంతో జర్నలిస్టులుగా చెప్పగా మాట కలిపాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆ గ్రామవాసులు బయటకు వచ్చి తమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
క్యాంపులతో కష్టమే కానీ
తిరుగు ప్రయాణంలో రాంపురం గ్రామస్తులతో మాట్లాడితే ‘మా గ్రామంలో క్యాంపు పెట్టొద్దని నెలల తరబడి అడవిలో గుడారాలు వేసుకొని నిరసన చేపట్టాం. అయినా పెట్టారు. ఆరంభంలో వారు మమ్మల్ని అనుమానించేవారు. క్యాంపు పరిసర ప్రాంతాల్లోకి పశువులను మేతకు తీసుకురావొద్దనేవారు. తునికాకు, ఇప్పపూల సేకరణకూ అడ్డుపడ్డారు. స్థానిక పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. రోజులు గడుస్తున్నా, కొద్ది ఒకరినొకరు గుర్తు పట్టడం మొదలయ్యాక ఆ ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి’అని చెప్పారు.