
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌తో కలిసి అదానీ డేటా నెట్‌వర్క్స్(ఏడీఎన్‌ఎల్) నుంచి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. 2022లో నిర్వహించిన వేలం ద్వారా 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏడీఎన్‌ఎల్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది.
కాగా.. ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు వీలుగా ఏడీఎన్‌ఎల్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. దీనిలో భాగంగా గుజరాత్(100 ఎంహెచ్‌జెడ్), ముంబై(100 ఎంహెచ్‌జెడ్), ఆంధ్రప్రదేశ్(50 ఎంహెచ్‌జెడ్), రాజస్తాన్(50 ఎంహెచ్‌జెడ్), కర్ణాటక(50 ఎంహెచ్‌జెడ్), తమిళనాడు(100 ఎంహెచ్‌జెడ్)లో స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది.