
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.
జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్‌బ్యాంకింగ్, ఇన్‌స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్‌లను రీలోడ్ చేయవచ్చు.
జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్‌లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.
ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్‌బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్‌బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
కస్టమర్లకు అలర్ట్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ అప్‌డేట్‌ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్‌లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్‌లకు సూచించింది.