
ప్రయివేట్ రంగ సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్‌ఎఫ్‌బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 504 కోట్లను తాకింది. ఇందుకు ఇతర ఆదాయం దోహదపడింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 428 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 3,385 కోట్ల నుంచి రూ. 5,031 కోట్లకు జంప్‌చేసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 57 శాతం దూసుకెళ్లి రూ. 2,094 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం మెరుగుపడి 5.8 శాతానికి చేరాయి. పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 2,106 కోట్లయ్యింది.
2023–24లో రూ. 1,591 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా.. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.67 శాతం నుంచి 2.28 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.55 శాతం నుంచి 0.74 శాతానికి పెరిగాయి. వెరసి ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 118 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు భారీగా పెరిగాయి.
మహీంద్రా లాజిస్టిక్స్ లాభం జూమ్
ప్రయివేట్ రంగ కంపెనీ మహీంద్రా లాజిస్టిక్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 67 శాతం జంప్‌చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో దాదాపు రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1,183 కోట్ల నుంచి రూ. 1,293 కోట్లకు బలపడింది. అయితే మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 30 శాతం క్షీణించి దాదాపు రూ. 44 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 62 కోట్లు ఆర్జించింది. కాగా.. టర్నోవర్ 10 శాతం వృద్ధితో రూ. 5,013 కోట్లను తాకింది. 2023–24లో రూ. 4,530 కోట్ల ఆదాయం అందుకుంది.