
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశంగా 2047 నాటికి అవతరించాలనే భారత లక్ష్యం సాకారమయ్యే ఆశయమని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా శనివారం అన్నారు. ఇందుకోసం దేశ తలసరి ఆదాయం ఏటా 7.3 శాతం పెరిగి రాబోయే 24 ఏళ్లలో 14,000 డాలర్లకు చేరుకోవాలని అన్నారు.
‘తలసరి ఆదాయంలో ఈ స్థాయి వృద్ధిని సాధించాలంటే భారత జీడీపీ రాబోయే 24 సంవత్సరాలలో 7.9 శాతం దూసుకెళ్లాలి. దేశ తలసరి ఆదాయం 2023–24లో దాదాపు 2,570 డాలర్లు. ఇది దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్, ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.
ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం, సహేతుక మూలధన సేకరణ, నైపుణ్య సముపార్జనతో తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుకోవడానికి భారత్‌కు అపార అవకాశం ఉంది. 21 సంవత్సరాలుగా మన వృద్ధి రేటు (వాస్తవ డాలర్ పరంగా) 7.8 శాతంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటుం 7.9 శాతానికి చేరుకోవడం పూర్తిగా సాధ్యమే. వికసిత భారత్ సాకారమయ్యే ఆశయం. ఈ వృద్ధి రేటును రాబోయే 10 సంవత్సరాలు కొనసాగిస్తే 9.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది’ అని వివరించారు.
ఇరు దేశాలు తగ్గిస్తే..
యూఎస్ ప్రతీకార పన్నులపై పనగరియా మాట్లాడుతూ.. ఇరు దేశాలు సుంకాలను తగ్గిస్తే పరిస్థితులు సానుకూలంగా మారతాయని అన్నారు. ఒకవేళ సుంకాల యుద్ధానికి దారితీస్తే.. అమెరికా భారతదేశంపై సుంకాలు విధించి, న్యూఢిల్లీ తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటే దురదృష్టకర ఫలితం ఉంటుందని ఆయన హెచ్చరించారు.