
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్‌ఏఐ(xAI).. హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్‌లుగా పనిచేయడానికి భాషా నిపుణుల కోసం గ్లోబల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ వంటి ఇతర భాషలలో నిపుణులను నియమించుకుంటోంది.
తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. "బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటాబేస్‌లు, ఆన్‌లైన్ వనరులను ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలలోకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం" అని ఉద్యోగ వివరణ పేర్కొంది.
వర్క్ ఫ్రమ్ హోమ్
ఎక్స్‌ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అభ్యర్థులు స్థానిక టైమ్ జోన్‌లో సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ ఉద్యోగ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంపికైనవారికి ప్రామాణిక వైద్య ప్రయోజనాలతో పాటు అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుండి 65 డాలర్లు (రూ. 2,900 నుండి రూ. 5,400) వరకు చెల్లిస్తారు.
ఎక్స్‌ఏఐ గురించి..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌ఏఐని 2023లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమ మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని వివిధ భాషలకు తమ సేవలను విస్తరిస్తోంది.