
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది.
తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది.
కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా?