
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది.
ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు
హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం
ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్‌లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్‌లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది.
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు.