
న్యూఢిల్లీ: దేశంలోని జపనీస్ కంపెనీ నిస్సాన్ వాటాను ఫ్రెంచ్ ఆటో రంగ దిగ్గజం రెనో కొనుగోలు చేయనుంది. దాంతో దేశీ భాగస్వామ్య కంపెనీ(జేవీ) రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్(ఆర్‌ఎన్‌ఏఐపీఎల్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ జేవీలో నిస్సాన్‌కుగల 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెనో తాజాగా పేర్కొంది. తద్వారా జేవీలో 100 శాతం వాటా పొందనున్నట్లు, కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదిరినట్లు తెలియజేసింది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. ఈ లావాదేవీ తదుపరి రెనో నిస్సాన్ జేవీలో రెనో గ్రూప్ వాటా 100 శాతానికి చేరనుంది. చెన్నైలోగల ప్లాంటు ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్ల వాహనాలను జేవీ రూపొందిస్తోంది. ఈ ప్లాంటు 6,300 ఉద్యోగులతో వార్షికంగా 4.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం సీఎంఎఫ్‌ఏ, సీఎంఎఫ్‌ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్‌లపై కైగర్, ట్రైబర్, క్విడ్ వాహనాలను తయారు చేస్తున్నట్లు రెనో గ్రూప్ సీఎఫ్‌వో డంకన్ మింటో పేర్కొన్నారు.
ఐటీసీ గూటికి సెంచరీ పల్ప్
డీల్ విలువ రూ.3,498 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ (ఏబీఆర్‌ఈఎల్)లో భాగమైన సెంచరీ పల్ప్ అండ్ పేపర్‌ను డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 3,498 కోట్లు. దీనితో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు వెసులుబాటు లభిస్తుందని ఏబీఆర్‌ఈఎల్ ఎండీ ఆర్‌కే దాల్మియా తెలిపారు. అలాగే ఏబీఆర్‌ఈఎల్ వాటాదార్లకు అధిక విలువ చేకూర్చేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు