
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారుగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల భవిష్యత్తును ఆయన హైలైట్ చేశారు.
మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. నేను ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడాను. ఆ సమయంలో ఎవరూ దానిని నమ్మలేదు, కానీ నేడు అది నిజమైందని గడ్కరీ అన్నారు. అప్పట్లో, భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు దీని విలువ 22 లక్షల కోట్లకు పెరిగింది.
భారత్.. అమెరికా, చైనా తర్వాత జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పుడు 2030 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.