
జ్యుయలర్ల అసోసియేషన్ అంచనా
మిశ్రమ ధోరణి ఉండొచ్చన్న సీఏఐటీ
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే.
‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ కొంత తగ్గొచ్చన్నారు.
అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి.