
నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.
2025–26 బడ్జెట్‌లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.
వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది.
60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది.
ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది.
యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు.
సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి.
ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానా
స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (సిఫ్) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది.
ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి.
అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో
ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు.