
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది.
బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.
బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది.