
టోల్ గేట్స్ వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి.. 2019లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ 'గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' (GNSS) తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
జీఎన్ఎస్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఇప్పటికే నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ నేషనల్ హైవే275, హర్యానాలోని పానిపట్-హిసార్ నేషనల్ హైవే709 మధ్యలో అమలు చేశారు. దీనికి సంబంధించిన ట్రైల్ కూడా విజయవంతంగా పూర్తయింది. కాగా రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్త శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని గడ్కరీ ప్రకటించారు.

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత.. వాహనాలు టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఈ విధానం టోల్ వసూళ్ల ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా.. రియల్-టైమ్ లొకేషన్ ట్రాకింగ్ జరుగుతుంది. అంతే కాకుండా వాహనదారుడు ప్రతిరోజూ హైవే మీద 20 కిమీ వరకు టోల్-ఫ్రీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అంటే 20 కిమీ ప్రయాణానికి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట.

శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌట్ కట్ చేసుకుంటుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది.