
దేశంలో రూ. లక్ష మార్కును దాటేసిన 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం
బెంగళూరు బులియన్ మార్కెట్‌లో రూ. 1,02,000గా నమోదు
హైదరాబాద్‌లో అటుఇటుగా రూ. 1,00,100కు చేరిక
డాలర్ బలహీనపడటం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలే పెరుగుదలకు కారణం
పసిడి పరుగే పరుగు..!
గత ఐదేళ్లలో రెట్టింపుకన్నా ఎక్కువగా పెరిగిన ధర..
మరింతగా పెరగొచ్చంటున్న బులియన్ మార్కెట్
ధరలకు ఆజ్యం పోస్తున్న అంతర్జాతీయ పరిణామాలు
అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు బంగారమే భద్రం అంటున్న ఇన్వెస్టర్లు
పసిడి...పరుగే పరుగు!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్‌లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది.
ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది.
మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.
ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..
మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.
బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.
కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.
ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.
- నూగూరి మహేందర్
ఎందుకీ పరిస్థితి?
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.
గరిష్టాలూ గరిష్టమే..
పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది.
వినియోగంలో మనం ఎక్కడంటే..
⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు
⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం
⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది.
రూపాయి బలపడటంతో ఉపశమనమే..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.
ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..
సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
ఆభరణాల్లో మనమే ఫస్ట్..
భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.
చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.
పెట్టుబడిగా బంగారం..
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు.
ఎగుమతులు డీలా..
భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి.
విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.
ఎస్‌జీబీల మాటేమిటి?
భారత్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్‌జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది.
తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్‌ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్‌లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
అందం, గుర్తింపు వ్యక్తీకరణ..
రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు.
- సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ
బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు..
..: వాణిజ్య సుంకాలు :..
సుంకాల కారణంగా ప్రపంచ
మార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనా
ప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి.
..: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..
కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది.
..: స్టాగ్‌ఫ్లేషన్ ఆందోళనలు :..
తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది.
..: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..
చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి.
..: ఫెడ్ రేటు కోతలు :..
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది.
..: స్థిరమైన పనితీరు :..
2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది.
..: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి.
..: కరెన్సీ హెచ్చుతగ్గులు :..
డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది.
..: పెరుగుతున్న రుణ స్థాయిలు :..
2024 నవంబర్‌లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది.
..: మార్కెట్ అస్థిరత :..
2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.
వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.
- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్
ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది.
– జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్