
సాక్షి, మలక్‌పేట: వైట్నర్ మత్తులో ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్‌సుఖ్‌నగర్ సీఎంఆర్ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్‌పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సలీంనగర్ ఆఫ్జల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ (28) పాతనేరస్తుడు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 2016లో చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. వైట్నర్ మత్తులో ఉన్న అతగాడు బ్లేడ్‌తో చేతులు కోసుకుని, కట్టెతో తల పగులగొట్టుకున్నాడు. చాయ్ కప్పు పెంకులు నమిలాడు. నన్ను ఎందుకు కొట్టారు..ఏం తప్పు చేశానంటూ వీరంగం చేశాడు.
అంతటితో ఆగకుండా లోకల్ బస్టాండ్‌పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ఇర్ఫాన్ బస్టాండ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిశాడు. పోలీసులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. అతడికి నచ్చజెప్పి కరెంట్ స్తంభం మీది నుంచి కిందికి దింపి స్టేషన్‌కు తరలించారు. మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.