
వాడపల్లి వెంకన్నకు రూ 1.47 కోట్ల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,47,12,969 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 32 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,16,439, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.24,51,230 చొప్పున ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే, బంగారం 13 గ్రాములు, వెండి 1.380 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్లు 64 వచ్చాయన్నారు. క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందని తెలిపారు.
వాడపల్లి వెంకన్న దర్శనానికి స్లాట్ విధానం
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. దీనికోసం తిరుమల తరహాలో వచ్చే నెల 1 నుంచి ప్రతి శనివారం స్లాట్ విధానం అమలు చేయనున్నారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వీఐపీ సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. చంటి పిల్లలు (తల్లి, రెండేళ్ల లోపు పిల్లలు), దివ్యాంగులకు (కాళ్లు లేకుండా పూర్తిగా నడవలేని వారు, చూపు పూర్తిగా కనపడని వారు, దివ్యాంగులతో పాటు ఒక సహాయకుడు) ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం పూర్తిగా ఉచితం. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత సిఫారసు లేఖలపై దర్శనాలను అనుమతించరు.