
మోదీది విభజించి, పాలించు విధానం
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింహాచలం ఘటన దురదృష్టకరమని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమరావతి సభ కోసం రాష్ట్రానికి మహారాజు వస్తున్నట్లుగా చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని రాష్ట్రానికి ఎలాంటి నిధులూ ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అవమానించారని అన్నారు. అందుకే తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా తాము నిరసన తెలుపుతామని ప్రకటించారు.
మోదీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని నారాయణ విమర్శించారు. పహల్గాం ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం ఏర్పాటు చేసిన ఆయన.. ఆ సమావేశానికి రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని అన్నారు. అక్కడి సహజ వనరులను, గనులను అదానీకి అప్పగించేందుకే కగార్ డ్రామా ఆడుతున్నారని నారాయణ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫ్యాక్షనిస్టులా మారిపోయారని, టైం ప్రకటించి మరీ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దేశ రక్షణ కంటే మావోయిస్టుల నిర్మూలన పైనే కేంద్ర హోం మంత్రి దృష్టి పెట్టారన్నారు. అందుకే పహల్గాం ఘటన జరిగిందన్నారు. పహల్గామ్ ఘటన తర్వాత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ తొలిసారి ప్రధాని మోదీకి అండగా నిలిచాయని, కానీ ఈ ఘటనను బీహార్, యూపీ ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనకు ఆమోదం తెలపడం మంచి పరిణామమని చెప్పారు. అయితే, నిర్దిష్ట కాలపరిమితితో కులగణనను ప్రకటించకపోవడం కేంద్రం చేస్తున్న మరో మోసమని విమర్శించారు.
దేశంలో కార్మికుల సాధించుకున్న హక్కులను పాలకవర్గాలు కాలరాస్తున్నాయని, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మిక హక్కులు హరించుకుపోయాయని, వంద మంది ఉంటేనే సంఘం కట్టే పరిస్థితి నెలకొందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఇండియా కూటమి మరింత బలపడాల్సిన అవసరముందన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాడిద చాకిరీ చేస్తూ బానిసల్లా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిదని నారాయణ అన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు.
ఫ కగార్ పేరుతో గిరిజనుల
జీవితాలు నాశనం చేయొద్దు
ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి
నారాయణ డిమాండ్