
జిబ్లీ: ఒకప్పుడు ప్రత్యేక టూల్స్‌తో చేసే పని ఇప్పుడు క్షణాల్లో..
ఆర్టిస్ట్ అవసరం లేకుండానే యూనిక్ పోట్రెట్స్
మా కళ మాయమైపోతోంది..: ఆర్టిస్టులు
ఏఐ ఆవిష్కరణలో ఇప్పుడిదే వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్‌లైన్‌లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్‌లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
పేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ..
ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్‌ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్‌లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.
ఇది అనైతికం..: హయావో మియాజాకి
తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది.