
జిబ్లీ ఫొటోలతో హోరెత్తుతున్న చాట్ జిపిటి
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు.
నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.
ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.
మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.
- సిమ్మాదిరప్పన్న