
ఎండ వేడికి అనేక చోట్ల పశువులు, పక్షులకు తీవ్ర అనారోగ్యం, మృత్యువాత
అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చికిత్స అందిస్తున్న ప్రాణిమిత్రులు
ప్రజలు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలి..
ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై వీటికోసం తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి
వేసవి ఎండలు మనుషులతోపాటు పశువులు, పక్షులపై కూడా తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. తాగునీరు లభించక, ఎండ వేడి తాళలేక అనేక పక్షులు నేల రాలుతున్నాయి. వీధి కుక్కలు, పిల్లులు వడదెబ్బ, అనారోగ్యంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాయి. ఇలాంటి మూగజీవాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రాణిమిత్రులు. అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సహకారంతో వాటికి చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఇలా మార్చి నుంచి ఇప్పటిదాకా 90పైగా పశువులు, పక్షులకు చికిత్స చేయించారు.

అపూర్వ కృషితో..సాధారణ స్థితికి..
ప్రస్తుతం ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రికార్డు స్ధాయిలో ఎండలు కాస్తున్నాయి. దీని వల్ల పక్షులు, జంతువులు వడదెబ్బ, అనారోగ్యాలతో చెట్లు, రోడ్లు, ఖాళీ మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ నేలకూలుతున్నాయి. కొన్నిసార్లు వీటి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రాణిమిత్రులు చేస్తున్న కృషి అపూర్వం. ఇలా అనారోగ్యంతో కునారిల్లుతూ తమ కంటబడిన ప్రాణులకు సకాలంలో వైద్య చికిత్స అందించి తిరిగి వాటిని సాధారణ స్థితి తీసుకురావడంలో వీరి పాత్ర ఎనలేనిది. ముంబైలో రోడ్లకు ఇరువైపుల, నివాస సొసైటీలు, టవర్ల ఆవరణలు, వాణిజ్య, వాపార సంస్ధల కాంపౌండ్‌లలో లక్షలాది చెట్లున్నాయి. వాటన్నింటిపై దృష్టిసారించడం ప్రాణి మిత్రులకు సాధ్యం కాని పని. అందుకే కొన్ని సార్లు అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సాయం తీసుకుని పక్షులు, జంతువులను కాపాడుతున్నారు. ఇలా కొద్దిరోజులుగా అటవీ శాఖ, రెస్క్యూ అసోసియేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్ధలు వందకుపైగా పక్షులను కాపాడాయి.
చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
కోలుకోగానే..యథాస్థానాలకు...
కాగా ఇటీవల ముంబై సిటీ, ఉప నగరాల్లోని బోరివలి, అంధేరీ తదితర ప్రాంతాల్లో పావురాలు, రామ చిలుకలు, పిచ్చుకలు, గుడ్లగూబలు, కాకులు, కోతులు, పిల్లులు, కుక్కలు ఇలా రకరకాల పశు, పక్షులు అనారోగ్య స్ధితిలో కనిపించాయి. స్ధానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీ శాఖకు, స్వయం సేవా సంస్ధలకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వైద్యుల బృందం వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని ఫస్ట్‌ఎయిడ్ చేసి పరేల్‌లోని యానిమల్ క్రూయాల్టీ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఇవన్నీ అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ శర్మ తెలిపారు. పూర్తిగా కోలుకోగానే తిరిగి బయట వదిలేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుట పడగానే వాటిని నైసర్గిక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా పశు, పక్షుల పట్ల మానవతా ధృక్పదంతో వ్యవహరించాలని ఖాళీ ప్రదేశాలలో, రోడ్ల పక్కన నీటితో నింపిన గిన్నెలు, ప్లేట్లు, ప్లాస్టిక్ మగ్గులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బతో బాధపడుతున్న జంతువులు, ఎండ వేడికి నేలరాలుతున్న పక్షుల గురించి 1926 అనే హెల్ప్ లైన్ నంబరుకు తెలియజేయాలని శర్మ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’