
టెక్నాలజీతో రూపుదిద్దుకున్న రామాయణ ఘట్టం ఉంది.అరేబియా తీరాన కొలువుదీరిన అతిపెద్ద గంగాధరుడున్నాడు.అనంత సంపన్నుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. భారతీయ మూర్తులకు పశ్చిమ రంగులద్దిన రవివర్మ ఉన్నాడు.కేరళ సిగ్నేచర్ హౌస్‌బోట్ విహారం ఉంది... కథకళి...కలరిపయట్టు విన్యాసాలూ ఉన్నాయి.టీ తోటలు... మట్టుపెట్టి డ్యామ్ బ్యాక్ వాటర్స్...ఇవే కాదు... ఇంకా చాలా చూపిస్తోంది ఐఆర్‌సీటీసీ.
మొదటి రోజు
త్రివేండ్రమ్ ఎయిర్‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్, కొకువెలి రైల్వేస్టేషన్‌ల నుంచి పికప్ చేసుకుని బస చేయాల్సిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్ త్రివేండ్రమ్ లేదా కోవళమ్‌లలో ఉంటుంది. సాయంత్రం కోవళం బీచ్, అళిమల శివుని విగ్రహాన్ని దర్శించుకుని విశ్రాంతి తీసుకోవడమే.
రెండో రోజు
ఉదయం త్రివేండ్రమ్‌లోని పద్మనాభస్వామి ఆలయ దర్శనం. జటాయు ఎర్త్ సెంటర్‌ని చూసిన తర్వాత ప్రయాణం కుమర్‌కోమ్ వైపు సాగుతుంది. ఈ ప్యాకేజ్ పేరుతో ఉన్న హౌస్‌బోట్ విహారం ఇక్కడ మొదలవుతుంది. కుమర్‌కోమ్ లేదా అలెప్పీలో క్రూయిజ్‌లోకి మారాలి. రాత్రి భోజనం, బస, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అన్నీ హౌస్‌బోట్‌లోనే.
తెరవని ఆరవ గది
త్రివేండ్రమ్... ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అనంత పద్మనాభ స్వామి వల్ల ఈ పేరు విశ్వవ్యాప్తంగా ప్రచారం సంతరించుకుంది. ఈ నగరానికి ఆ పేరు వచ్చింది కూడా అనంత పద్మనాభ స్వామి వల్లనే. తిరు అనంత పురం... క్రమంగా మలయాళీల వ్యవహారంలో తిరువనంతపురం అయింది. బ్రిటిష్ వారి వ్యవహారంలో త్రివేండ్రమ్‌గా మారింది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయంలో తెరవని ఆరో గది ఇప్పటికీ ఆసక్తికరమే. నాగబంధంతో మూసిన ఆ గదిని తెరవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పద్మనాభ స్వామి ఆలయ దర్శనంలో ఈ గదిని తప్పనిసరిగా చూడాలి. ఇక త్రివేండ్రమ్ అనగానే గుర్తొచ్చే మరో పేరు రాజా రవి వర్మ. భారతీయ దేవతల చిత్రాలకు కొత్తరంగులద్దిన ట్రావెన్‌కోర్ రాజవంశానికి చెందిన రవివర్మ నివాసాన్ని కూడా చూడవచ్చు.
జటాయు ఎర్త్ సెంటర్... ఇది ఒక థీమ్ పార్క్. జటాయు పక్షి ఆకారంలో నిర్మించారు. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో రావణుడితో పోరాడి ప్రాణాలు వదిలిన పక్షి జటాయు. ఆ పక్షి రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పార్క్‌ను పశ్చిమ కనుమల్లో ఓ కొండ మీద 65 ఎకరాల్లో నిర్మించారు. ఈ కొండమీదకు వెళ్లడానికి ఎనిమిది వందలకు పైగా మెట్లెక్కాలి. కేబుల్‌కార్ కూడా ఉంది. ఆరోగ్యవంతులు ఎక్కగలిగిన కొండే అయినప్పటికీ బయటి ప్రదేశాల నుంచి పర్యటన కోసం వచ్చిన వాళ్లు టైమ్ వేస్ట్ చేసుకోకుండా పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షిస్తూ కేబుల్ కార్‌లో వెళ్లడమే మంచిది. వెకేషన్ కోసం వెళ్లి నాలుగైదు రోజులు బస చేసేవాళ్లు ఒక రోజు కొండ ఎక్కడాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్యాస్టిక్‌ని అనుమతించరు.
మూడో రోజు
అలెప్పీ నుంచి మునార్‌కు ప్రయాణం. రోడ్డు మార్గాన మునార్‌కు చేరాలి. మధ్యలో పునర్జనిలో కేరళ సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించాలి. రాత్రి బస మునార్‌లో.
కలరిపయట్టు... కథకళి చూద్దాం!
పునర్జని ట్రెడిషనల్ విలేజ్... కేరళ సంప్రదాయ కళల ప్రదర్శన వేదిక. అలాగే ఆయుర్వేద చికిత్సల నిలయం కూడా. మునార్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోజూ సాయంత్రం ఆరు గంటలకు కథకళి నాట్యం, కలరిపయట్టు యుద్ధకళా విన్యాసాలను ప్రదర్శిస్తారు. రిలాక్సేషన్ థెరపీలు ఐదు నుంచి పదిహేను వేలు చార్జ్ చేస్తారు. అవి ఈ ప్యాకేజ్‌లో వర్తించవు.
నాలుగో రోజు
రోజంతా మునార్‌లోనే. ఎరవికులమ్ నేషనల్ పార్క్ పర్యటన, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎఖో పాయింట్, కుందల డ్యామ్ లేక్‌లో విహరించిన తర్వాత రాత్రి బస మునార్‌లోనే.
మునార్ టీ తోటల మధ్య విహారం, ఝుమ్మనే వాటర్ ఫాల్స్ ను దూరం నుంచే చూస్తూ ముందుకు సాగిపోవడంతోపాటు టీ మ్యూజియం సందర్శన బాగుంటుంది. మట్టుపెట్టి డ్యామ్, రిజర్వాయర్ చుట్టూ విస్తరించిన టీ తోటల దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరవికులమ్ నేషనల్ పార్క్ విజిట్ మరిచిపోలేని అనుభూతి. నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి పూచే నీలకురింజి పువ్వు దట్టంగా పూసేది ఇక్కడే. నీలకురింజి మళ్లీ పూసేది 2030లో. కానీ ఎక్కడో ఓ చోట ఒకటి రెండు గుత్తులు కనిపిస్తాయి. గైడ్‌లు వాటిని చూపించి కొండ మొత్తం పూసినప్పుడు దృశ్యం ఎలా ఉంటుందో ఫొటోలు చూపిస్తారు.
అయిదో రోజు
మునార్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కొచ్చి వైపు సాగిపోవాలి. కొచ్చిలో హోటల్ చెక్ ఇన్. మెరైన్ డ్రైవ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత షాపింగ్ తర్వాత నైట్ స్టే.కొచ్చిలో షాపింగ్ చేయడం మొదలు పెడితే మన లగేజ్ పెరిగిపోతుంది. లవంగాలు, యాలకులు, మిరియాల వంటివి చక్కటి ఘాటు వాసనతో స్వచ్ఛంగా ఉంటాయి. టూర్ గుర్తుగా కేరళ చీర ఒక్కటైనా కొనుక్కోవాలి. అవి బాగా మన్నుతాయి కూడా! స్థానిక హస్తకళాకృతులకు కొదవే ఉండదు. కోకోనట్ కాయిర్‌తో చేసిన గృహోపకరణాలు కూడా బాగుంటాయి. కథకళి సావనీర్‌లు తెచ్చుకోవచ్చు. ఆయుర్వేద తైలాల పేరుతో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు, నకిలీలు కూడా ఉంటాయి. వీటిని గవర్నమెంట్ ఆథరైజ్‌డ్ స్టోర్‌లలో మాత్రమే కొనాలి. షాపింగ్ చేసేటప్పుడు ఫ్లయిట్‌లో లగేజ్ బరువు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. వెళ్లేటప్పుడు ఫ్లయిట్, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్‌లో ప్రయాణం చేస్తే లగేజ్ బరువు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది.
ఆరో రోజు
కొచ్చిలో హోటల్ చెక్ అవుట్ చేసి, కొచ్చి లోని డచ్ ప్యాలెస్ సందర్శనం. యూదుల సినగోగ్ (ధార్మిక సమావేశ మందిరం), సర్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రాజ్ బాసిలికా పర్యటన తర్వాత కొచ్చి ఎయిర్ పోర్ట్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ పూర్తవుతుంది. కొచ్చి, ఎర్నాకుళం మన హైదరాబాద్– సికింద్రాబాద్ వంటి జంట నగరాలు. ఎయిర్΄ోర్టు కొచ్చిలో ఉంది, రైల్వే స్టేషన్ ఎర్నాకుళంలో ఉంది.
వాస్కోడిగామా రాక ఫలితం!
డచ్ ప్యాలెస్... అనగానే పాశ్చాత్య నిర్మాణశైలిని ఊహిస్తాం. కానీ ఇది పూర్తిగా కేరళ సంప్రదాయ నాలుకేట్టు నిర్మాణశైలిలో ఉంటుంది. పోర్చుగీసు వాళ్లు నిర్మించడం వల్ల డచ్ ప్యాలెస్‌గా అనే పేరు వచ్చింది. ఇది కొచ్చి నగరానికి సమీపంలోని మత్తన్ చెర్రి అనే ప్రదేశంలో ఉండడంతో స్థానికులు మత్తన్‌చెర్రి ప్యాలెస్ అనే పిలుస్తారు. వాస్కోడిగామా మనదేశంలో కేరళతీరం, కొచ్చి రాజ్యం, కప్పడ్ దగ్గర ప్రవేశించాడు. కొచ్చి రాజు అతడికి సాదర స్వాగతం పలికాడు. మనదేశం బ్రిటిష్ వలస పాలనలోకి వెళ్లడానికి దారులు వేసిన ఒక కారణం ఇది. ఈ ప్యాలెస్ భవనాల సముదాయం హెరిటేజ్ సైట్‌ల జాబితా కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ ప్యాలెస్ లోపల నాటి చిత్రరీతుల ప్రదర్శన ఉంది.
యూదులు వచ్చారు!
మత్తన్‌చెర్రిలో డచ్ ప్యాలెస్ పక్కనే యూదు మతస్థుల ధార్మిక సమావేశ మందిరం సినగోగ్ కూడా ఉంది. ఇది కూడా డచ్ ప్యాలెస్ నాటి 16వ శతాబ్దం నాటి నిర్మాణమే. పశ్చిమం నుంచి మనదేశానికి అరేబియా సముద్రం మీదుగా జలమార్గాన్ని కనుక్కున్న తర్వాత పాశ్చాత్య దేశాలతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. వర్తకులు, నౌకాయాన ఉద్యోగులు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం మొదలైంది. అలా స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చిన వారిలో కొంతమంది ఇక్కడే స్థిరపడ్డారు. ఆ కాలనీలు క్రమంగా వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి మందిరాలు కట్టుకున్నారు. అలాంటిదే ఇది కూడా. ఈ సినగోగ్ క్రిస్టల్ షాండ్లియర్‌లతో అందంగా ఉంటుంది. తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశంలో భారతీయులుగా మమేకమయ్యారు.
‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’...
ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజ్. ఇందులో త్రివేండ్రమ్, అలెప్పీ, మునార్, కొచ్చి ప్రదేశాలు కవర్ అవుతాయి. నీలగిరి తార్‌కు ప్రసూతి సమయం కావడంతో మునార్‌లోని ఎరవికులమ్ నేషనల్ పార్క్‌ను ఏప్రిల్ 1 వరకు క్లోజ్ చేశారు. ప్రస్తుతం పర్యాటకులను అనుమతిస్తున్నారు. కాబట్టి ‘వింగ్స్ ఆఫ్ జటాయు విత్ హౌస్‌బోట్’ టూర్‌కి ఇది అనువైన సమయం.
కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి దాదాపుగా 57 వేల రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 30 వేలవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. పిల్లలకు విడిగా బెడ్ తీసుకుంటే తొమ్మిది వేలు, బెడ్ తీసుకోకపోతే దాదాపుగా ఐదు వేల ఐదు వందలు.
టూర్‌లో ఏసీ వాహనంలో ప్రయాణం, ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, మార్గమధ్యంలో టోల్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, ప్యాకేజ్‌లో చెప్పిన ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్‌లు, హోటల్ గది బస, హౌస్‌బోట్‌లో బస, నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, హౌస్‌బోట్‌లో లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజ్‌లో ఉంటాయి.
ప్యాకేజ్‌లో మన ప్రదేశం నుంచి త్రివేండ్రమ్‌కు చేరడం, కొచ్చి లేదా ఎర్నాకుళం నుంచి ఇంటికి రావడానికి అయ్యే రైలు లేదా విమాన ఖర్చులు వర్తించవు. త్రివేండ్రమ్‌లో రిసీవ్ చేసుకోవడం నుంచి కొచ్చిలో వీడ్కోలు పలకడం వరకే ఈ ప్యాకేజ్.
ఇటీవల పర్యాటకులు యూ ట్యూబ్ వీడియోల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా హౌస్‌బోట్ ప్రయాణంలో నిర్వహకుల సూచనలను విధిగా పాటించాలి.
ఈ టూర్‌లోని పర్యాటక ప్రదేశాల్లో మునార్ టీ మ్యూజియానికి సోమవారం సెలవు, కొచ్చిలోని డచ్ ప్యాలెస్ శుక్రవారం, యూదుల సినగోగ్‌కి శనివారం సెలవు. వీటిలో ఒకటి – రెండు మిస్ కాక తప్పదు.

విమానాశ్రయంలో దేవుని ఊరేగింపు!
త్రివేండ్రమ్ చేరడానికి విమానంలో వెళ్లడం వల్ల బోనస్ థ్రిల్ ఉంటుంది. పద్మనాభస్వామి ఊరేగింపు కోసం విమానాలు ల్యాండింగ్ ఆపేస్తారు. ఏడాదికి రెండు దఫాలు ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పైన్‌కుని పండుగ సందర్భంగా జరిగే పది రోజుల వేడుకలో చివరి రోజు ఆరట్టు (సముద్రస్నానం) కోసం పద్మనాభ స్వామి ఊరేగింపు ఆలయం నుంచి షంగుముగమ్ బీచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరం సాగుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అల్పఱి పండుగ వేడుకల సందర్భంగా కూడా రన్‌వేని మూసివేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం రన్‌వే ఈ దారిలోనే ఉంది. విమానాశ్రయాన్ని నిర్మించేటప్పుడే (1932 ) ప్రభుత్వం విధించిన నియమం ఇది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు ఇక్కడ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోవు. పండుగకు రెండు నెలల ముందే ఆలయ ట్రస్ట్ బోర్డు వేడుకల షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీకి తెలియచేస్తుంది. ఆ మేరకు ఏ తేదీన ఏ సమయంలో ఎయిర్΄ోర్ట్ రన్‌వేను మూసివేయనున్నారనే సమాచారం అక్కడ రాకపోకలు సాగించే విమానాల సంస్థలకు అందుతుంది. ఇది ప్రపంచవింత కాదు కానీ విచిత్రం.
-వాకా మంజులా రెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి