
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు.
ఓనవిల్లు అంటే
శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్‌లు వాయిస్‌ని అందించడం విశేషం.
సంపదకు రక్షణగా ట్రావెన్‌కోర్
కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్‌కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం.