Travancore
-
ఆయనకు వీఐపీ దర్శనం ఎలా ?.. కోర్టు ఆగ్రహం
శబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి చేసి భక్తితో వెళ్తారు. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా, శ్రామికుడైనా సరే స్వామి దర్శనం విషయంలో సమానమే... అయితే, మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్‌కు శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇదే సమయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ)పై మండిపడింది.డిసెంబర్ 4న నటుడు దిలీప్ శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. దీంతో సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై అక్కడి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, కొందరైతే దర్శనం కూడా చేసుకోకుండానే వెనుదిరిగారు అంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది.నటుడు దిలీప్‌ను ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు ప్రశ్నించింది. టీడీబీ చేసిన పొరపాటు వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు వెళ్లడించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారే ఇలాంటి తప్పులు చేస్తే.. భక్తులు ఎవరితో చెప్పుకుంటారని తప్పబట్టింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే అక్కడ వీఐపీ దర్శనం ఉంటుందని ఈమేరకు కోర్టు గుర్తుచేసింది. ఇతరులు ఎవరైనా సరే ఆ అవకాశం కల్పించడం విరుద్ధం అంటూ న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్‌ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం. -
ట్రావన్ కోర్ యువరాణికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారం
సాక్షి, తిరుపతి: సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న ట్రావన్ కోర్ ప్రిన్సెస్ అశ్వతి గౌరి లక్ష్మీబాయికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయిని ఘనంగా సత్కరించారు. పద్మనాభ స్వామి దేవాలయం సంపదల పరిరక్షణలో ఆమె చేసిన పోరాటం ప్రశంసనీయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్, టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్ వేసేవారట
రాజా రవి వర్మ.. భారతీయ చిత్రకారుడిగా ఆయన పేరు నేటికీ సజీవమే.1848 ఏప్రిల్ 29న కేరళలోని కిలమానూరులో జన్మించిన రవి వర్మ ఏడేళ్ల వయసు నుంచే చిత్రాలు గీయడం ప్రారంభించారు. ప్రతీ రోజూ ఆయన చూసిన దృశ్యాలనే గోడలపై అందమైన చిత్రాలుగా రూపొందించేవారు. రకరకాల పువ్వులు, చెట్ల ఆకులతో తన చిత్రాలకు రంగులద్దేవారు. రవి వర్మ ప్రతిభను మెచ్చిన అప్పటి ట్రావెన్కోర్ మహారాజా ఆయన ఆస్థానంలోకి సగర్వంగా ఆహ్వానించారు. అక్కడే ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేసిన రాజా రవి వర్మ..బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద ఆయల్ పెయింటింగ్ ఎలా గీయాలో నేర్చుకున్నాడు. వాటర్ కలర్లకు బదులుగా ఆయిల్ పెయింటింగ్‌ని ఉపయోగించిన తొలి భారతీయ చిత్రకారుడిగా రికార్డులకెక్కారు. రాజా రవి వర్మ ఆయన 18వ ఏట రాజ కుటుంబానికి చెందిన భాగీరథీబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ముగ్గురు పిల్లలు. అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత చిత్రకారుడిగా రాజా రవి వర్మ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దేశంలోని నలమూలల నుంచి పెయింటింగ్స్ గీయాలని రోజూ కొన్ని వందల అభ్యర్థలను వచ్చేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెయింటింగ్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నా, ఆయన గీసే చిత్రాలు కేవలం దర్శనాత్మకంగా, ఛాందసంగా చిత్రాలు ఉంటాయన్న విమర్శలనూ ఎదుర్కోక తప్పలేదు. భారతీయ సాంప్రదాయ చిత్రకళకు పాశ్చాత్యాన్ని జోడించి పెయింటింగ్స్ వేయడంలో రాజా రవి వర్మ సిద్దహస్తులు. అందుకే ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ ఆర్ట్'గా పిలుస్తారు. రామాయణ, మహాభారతములోని ఘాట్టాలను అందంగా చిత్రీకరంచే రాజా రవి వర్మ..నలదమయంతుల, శకుంతలా దుష్యంతుల చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1873 లో వియన్నాలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతిని గెలుచుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన పెయింటింగ్స్‌కు విదేశీయులు కూడా ముగ్ధులయ్యేవారు. హిందూ దేవతా స్త్రీల చిత్రాలను దక్షిణ భారతయ స్త్రీలలాగా ఊహించి ఎన్నో పెయింటింగ్స్ వేసేవారు. దక్షిణ భారత స్త్రీలు ఎంతో అందంగా ఉంటారని బాగా విశ్వసించేవారు. దేశంలోనే మొదటిసారిగా పెయింటింగ్స్ కోసం ముంబైలో అత్యాదునిక ప్రెస్‌ను ప్రారంభించిన రాజా రవి వర్మ ఇందుకోసం దేశం నలుమూలల నుంచి చిత్రకారులను పిలిపించుకున్నారు. ఇక 58 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా 1906లో కన్నుమూశారు. రాజా రవి వర్మ చనిపోయేనాటికి దాదాపు 7వేల పెయింటింగ్స్‌ను గీసినట్లు సమాచారం. రవి వర్మ మరణానంతరం ఆయన పెయింటింగ్స్‌ను తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. -
‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?
న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్కోర్ రాజ కుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది.(పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే) దీంతో పద్మనాభుడి ఆలయం కింద ఉన్న ఆరో నేలమాళిగలోని రహస్యం త్వరలోనే బయటపడుతుందన్న ఊహాగానాలకు తెరపడింది. అనంతపద్మనాభ స్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ సంస్థానాధీశుడు అనంతపద్మనాభ స్వామికి తన రాజ్యం మొత్తాన్ని ధారాదత్తం చేశాడు. చివరకు తనను తానే స్వామికి దాసుడిగా చేసుకున్నాడు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఆలయంలోని ఐదు నేళమాళిగలను తెరిచిన సంగతి తెలిసిందే. వీటిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపద ఉన్నట్లు లెక్కల్లో తేలింది. ఆరో నేళమాళిగను తెరిచేందుకు రాజకుటుంబ ఆధ్వరంలోని దేవాలయ పాలకమండలి ఒప్పుకోలేదు. ఆరో నేళమాళిగ శాపానికి గురైందని, అది తెరిస్తే భగవంతుడి ఆగ్రహానికి గురవక తప్పదని పురాణాల్లో ఉందని వెల్లడించింది. ఆలయ చరిత్ర పద్మనాభుడి ఆలయ చరిత్ర, ట్రావెన్కోర్ సంస్థాన చరిత్రతో ముడిపడి ఉంది. అయితే, ఆలయం ఎప్పుడు నిర్మితమైందన్న దానిపై 2011లో కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం భిన్నవాదనలున్నాయి. పురాణాల్లో కూడా ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్న దానిపై రకరకాల కథలున్నాయి. స్పష్టంగా తెలిసిన విషయమేంటంటే... 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయ బాధ్యతలను నాటి ట్రావెన్కోర్ పాలకుడు అనిఝామ్ తిరునాళ్ మార్తాండవర్మన్ తన భుజానికి ఎత్తుకున్నాడు. రాజుతో కలిపి మొత్తం ఎనిమిదిన్నర(8+1/2) మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకునేది. ఇక్కడ ఎనిమిదిన్నరను కేరళ హైకోర్టు తన తీర్పులో రాజు ఓటు విలువ అరగా పేర్కొంది. ఎనిమిది మందిలో ఏడుగురు బ్రహ్మణులు, ఒకరు నాయర్. అయితే, 1720ల్లో బృందంలోని మిగతా ఎనిమిది మందితో రాజు మార్తాండవర్మన్కు ఆలయ పాలనపై వివాదం తలెత్తింది. అర ఓటు హక్కు కలిగిన రాజుకు ఆలయ బాగోగుల్లో చాలా తక్కువ పాత్ర ఉండేదని కేరళ హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఈ ఎనిమిదిన్నర మందితో కూడిన బృందం ఆలయపాలనను చూసుకుంటే, మరో ఎనిమిది మందితో కూడిన ‘ఎట్టువీట్టిల్ పిల్లామర్స్’ఆలయ ఆస్తులను చూసుకునేది. ఈ బృందంలోని ఎనిమిది మంది నాయర్లు. వీరు ట్రావెన్కోర్ సంస్థానంలోని ఎనిమిది పెద్ద కుటుంబాలకు చెందినవారు. కేరళ హైకోర్టు ప్రకారం.. మార్తాండవర్తన్ను ఎలాగైనా గద్దె దించి, అతని సోదరి కుమారుడిని సంస్థానాదీశుడిని చేయాలని రెండు బృందాల్లోని సభ్యులు భావించారు. కానీ వీరోచిత పోరాటంతో మార్తాండ వర్మన్ తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అప్పటిదాకా ముక్కలుగా ఉన్న ట్రావెన్కోర్ రాజ్యాన్ని ఏకం చేయడానికి అనేక యుద్ధాలు చేసి విజయపతాకం ఎగురవేశాడు. ఈ కేసులో తుది తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. రాజకుటుంబానికి చెందిన ఓ యువరాజు రాసిన పుస్తకాన్ని ప్రస్తావించింది. మహాభారతంలోని అర్జునిడిలా, కళింగ యుద్ధం తర్వాత అశోకునిలా.. ప్రాణనష్టాన్ని చూసి మార్తాండవర్మన్ చలించిపోయాడని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తన రాజ్యాన్నంతటినీ పద్మనాభస్వామి ఆలయానికి ధారాదత్తం చేశాడని రచయిత రాసుకొచ్చారని చెప్పింది. ఆ తర్వాత దేవాలయ ఆలనాపాలనను మార్తాండవర్మే రాజ కుటుంబమే చూసిందని పేర్కొంది. బ్రిటీష్ పాలన 1758లో 53 ఏళ్ల వయసులో మార్తాండవర్మన్ కాలం చేశారు. 1810 నాటికి ట్రావెన్కోర్ సంస్థానం ఇద్దరు రాణులు గౌరీ లక్ష్మీ భాయ్, గౌరీ పార్వతి భాయ్ పాలనలోకి వచ్చింది. ఈ సమయంలో టిప్పు సుల్తాన్‌పై యుద్ధాలకు బ్రిటీషర్లు, ట్రావెన్కోర్ అధిపతులకు సాయం చేశారు. ఆ తర్వాత రాణులు బ్రిటీషర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఫలితంగా ట్రావెన్కోర్ సంస్థానంలోని ప్రతి ఆలయం బ్రిటీష్ పాలనలోకి వెళ్లిందని కేరళ హైకోర్టు 2011లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావించింది. 1811లో సంస్థాన అవసరాలకు ఆలయం నుంచి డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించేలా ట్రావెన్కోర్ ఒప్పందం చేసుకోవడం పద్మనాభుడి సంపదను తెలియజేస్తుంది. బ్రిటిషర్లు చేసిన ఏర్పాట్ల ప్రకారం 1940 వరకూ ఆలయపాలన సాగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి పాలకుడు బలరామవర్మన్తో సంప్రదింపుల అనంతరం ట్రావెన్కోర్ భారత్‌లో విలీనమైంది. సమస్య ఎక్కడంటే? ట్రావెన్కోర్ పాలకుడిగా బాధ్యతలు తీసుకునేప్పుడు బలరామవర్మన్ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందుకు కారణం ఉంది. ట్రావెన్కోర్ సంస్థానాధీశుడిగా అనంతపద్మనాభ స్వామిని, బలరామవర్మన్ వంశం భావిస్తుంది. దేవుడి తరఫున మాత్రమే రాజ్యం ఆలనాపాలనా చూస్తారు. 1991లో బలరామవర్మన్ కాలం చేశారు. ఆ తర్వాత ఆయన సోదరుడు తిరునాళ్ మార్తాండవర్మన్ రాజ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కేరళ ప్రభుత్వం గుడి మేనేజ్మెంట్లో ఆయన్ను సభ్యుడిగా ఉంచింది. కానీ ఆయన ఆలయ భూములు, రాజ కుటుంబానికి చెందినవేనని చేసిన ప్రకటనతో వివాదం రాజుకుంది. చాలా మంది భక్తులు దీనిపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. మార్తాండవర్మన్కు గుడి మేనేజ్మెంట్పై ఎలాంటి హక్కులూ లేవని హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు గుడిలోని నేళమాళిగలను తెరవాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఈ విషయం సుప్రీం కోర్టును చేరింది. దాంతో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం నేళమాళిగలను తెరవాలని ఆదేశించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఐదు గదుల్లో బంగారు విగ్రహాలు, వందల కిలోల బంగారు ఆభరణాలు, 60 వేలకు పైచిలుకు వజ్ర, వైఢూర్యాలు, రోమన్ బంగారు నాణెలు తదితరాలు లభ్యమయ్యాయి. దీంతో పద్మనాభస్వామి ఆలయ ఖ్యాతి ప్రపంచమంతటా పాకింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇదేననే భావన అంతటా మొదలైంది. ఇక్కడ దొరికిన వస్తువుల విలువను లెక్కగట్టేందుకు కమిటీ సభ్యులు నేషనల్ జాగ్రఫీ సొసైటీ సాయాన్ని కూడా కోరారు. తుది తీర్పు ‘ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది.‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. భవిష్యత్‌లో ఏర్పాటుకానున్న కమిటీయే ఆరో నేళమాళిగను తెరవాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. -
పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే
న్యూఢిల్లీ: దేశంలోని సంపన్న దేవాలయాల్లో ఒకటైన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఈ దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్కోర్ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ యాజమాన్య హక్కులపై దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ సోమవారం తుది తీర్పు వెలువరించింది. ‘చివరి పాలకుడు మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వమే ఆలయ యాజమాన్య కమిటీని నియమించాలనడం చెల్లదు. రాజకుటుంబానికి వారసులు లేనందున ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయన్న న్యాయపరమైన నిబంధన ఈ కేసుకు వర్తించదు. ట్రావెన్కోర్ పాలకుడి నియంత్రణలో ఆలయ యాజమాన్య కమిటీ కొనసాగుతుంది’అని తెలిపింది. ‘ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఈ ఆలయంపై ఉన్న హక్కులు కొనసాగుతాయి. చివరి పాలకుడు బలరామ వర్మ సోదరుడు మార్తాండవర్మకు, ఆయన వారసులకు ఈ ఆలయంపై సర్వహక్కులు ఉంటాయి’అని స్పష్టం చేసింది. ‘మరో కమిటీ ఏర్పాటయ్యే వరకు తిరువనంతపురం జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆలయ పాలనా వ్యవహారాలను చూసుకుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలో సభ్యులంతా హిందువులే అయి ఉండాలి’అని స్పష్టతనిచ్చింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన చివరి పాలకుడు బలరామ వర్మ 1991లో మరణించారు. దీంతో పద్మనాభస్వామి ఆలయంపై ఆయన వారసులకు హక్కులు లేవనీ, ఆలయాన్ని, అందులోని సంపదను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, ఒక కమిటీ నేతృత్వంలో నిర్వహించాలంటూ 2011 జనవరిలో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్‌లో స్టే విధించింది. ఇది చారిత్రక తీర్పు.. సుప్రీంకోర్టు తాజా తీర్పు చరిత్రాత్మకమని, సుప్రీంకోర్టు నియమించిన ఆలయ కమిటీ చైర్మన్ సీవీ ఆనంద బోస్ అన్నారు. తీర్పు.. మత విషయాల్లో రాజకీయాలు, రాజకీయాల్లో మతం జోక్యం చేసుకోరాదనే సందేశాన్నిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి.. పూర్వం కేరళలోని దక్షిణ భాగం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ట్రావెన్కోర్ రాజకుటుంబం పాలించేది. ఈ పాలకుల కుటుంబదైవం అనంతపద్మనాభ స్వామి(విష్ణువు). తిరువనంతపురంలోని పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయం స్థానంలో 18వ శతాబ్దంలో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కూడిన విశాలమైన ఆలయాన్ని ఈ పాలకులు నిర్మించారు. ఈ ఆలయ అంతర్భాగంలోని ఆరు నేలమాళిగల్లో వెలకట్టలేని సంపద ఉన్నట్లు ప్రతీతి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా ఈ రాజకుటుంబం నేతృత్వంలోనే ఆలయ నిర్వహణ కొనసాగింది. అయితే, అపార సంపదలున్న ఈ ఆలయ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో వివాదం కోర్టుదాకా వెళ్లింది. దీంతో, ఆలయ నిర్వహణను, ఆస్తులను స్వాధీనం చేసుకుని సంప్రదాయం ప్రకారం నిర్వహణ చేపట్టాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకుటుంబం సవాల్ చేయడంతో కేరళ హైకోర్టు తీర్పుపై 2011లో స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆలయంలోని నేలమాళిగ(కల్లారం)ల్లో భద్రపరిచిన ఆభరణాలు, సంపదను లెక్కకట్టాలనీ, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలనీ, ఆలయ నిర్వహణపై ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశించింది. లాయర్ గోపాల్ సుబ్రమణ్యంను అమికస్ క్యూరీగా నియమించింది. నేలమాళిగ ‘బి’లో అద్భుత శక్తులతో కూడిన అపార సంపద ఉన్నందున తెరవరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ మేరకు సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘా మధ్య మొదటి నేలమాళిగలోని సంపద లెక్కింపు కూడా చేపట్టారు. అనూహ్యంగా వేల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు అంచనాలు వెలువడటంతో ఈ ఆలయం ప్రాభవం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
ట్రావెన్కోర్ రాజకుటుంబం కొనసాగొచ్చు: సుప్రీంకోర్టు
-
సంఘర్షణ నేర్పిన సంస్కృతి
తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. ‘హిందూమతంతో మాకు ఎటువంటి సామ్యం లేదు. మేము హిందువులు అనుసరించే పూజా పద్ధతులనూ, ఇతర విధానాలనూ అనుసరించటంలేదు. మా దైవం, దేవత అంతా దర్పణమే. అంటే అద్దానికే పూజలు చేస్తాం. దేవాలయాల్లో కొబ్బరి కాయలు కూడా కొట్టం. మా వివాహ పద్ధతులు వేరు. మరణం తర్వాత పాటించే సంప్రదాయాలు వేరు. అందువల్లనే మమ్మల్ని వేరే మతంగా ప్రకటించాలని కోరుతున్నాం’ అంటూ ‘అయ్యవాజి’ సామాజిక వర్గం కోరుతున్నది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, కన్యాకుమారిలో ఉన్న ప్రధాన దేవాలయాన్ని సందర్శించిన సమయంలో తాము ఇలా విజ్ఞప్తిని చేశామని, ఆమె సానుకూలంగా స్పందించారని, కానీ ఆమె మృతితో తమ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ విధంగా మిగిలిందని, అయ్యవాజీల అధిపతి బాలప్రజాపతి అడికల్ ఈ మధ్య పత్రికా ప్రతినిధుల ఎదుట వాపోయారు. కర్ణాటకలో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత వీరి డిమాండ్‌కు ప్రాధాన్యం పెరి గింది. కానీ ఇది కొత్త డిమాండ్ కాదు. అయ్యవాజి సామాజిక వర్గం ఎక్కడిది? ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నలు సందర్భోచితం. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ట్రావెన్కోర్ సంస్థానంలో ఒక సామాజిక ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆ ఉద్యమమే ఆ తర్వాత ఒక జీవన విధానమైంది. ఆ ఉద్యమ వ్యవస్థాపకుడినే భగవంతుడి అవతారంగా పరిగణించారు. ఆనాటి అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటు ఒక మత సంప్రదాయంగా అవతరించింది. ఒక సామాజిక పోరాటం మతంగా రూపుదిద్దుకోవడం ఎలా జరిగిందో ఊహించడానికి ఇదొక ఉదాహరణ. పైగా ఇది ఆధునిక యుగంలో జరగడం విశేషం. ట్రావెన్కోర్ సంస్థానంలో కులవివక్ష, అణచివేత, అంటరానితనం కింది స్థాయి ప్రజలను ఎన్నో ఇక్కట్లకు గురిచేశాయి. మెజారిటీ కులాలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. ఉద్యోగాల్లో స్థానం లేదు. అగ్రకులాలు నడిచేదారుల్లో నడవడానికి వీలు లేదు. ఇందులో ఎక్కువగా వివక్షకు, అణచివేతకు గురైంది నాడార్లే. నాడార్ల ప్రధాన వృత్తి కల్లుగీత. వ్యవసాయం ఇతర నిర్మాణ పనుల్లోను వీరి ప్రమేయం ఎక్కువే. వీరి చేత ప్రభుత్వ భవనాలూ, దేవాలయాలూ నిర్మాణం చేయించేవారు. కానీ వేతనాలు లేవు. స్పష్టంగా చెప్పాలంటే వెట్టిచాకిరి. ఇంకా సంస్థానాధీశులు వీరిపైన విపరీతంగా పన్నులు విధించేవారని చరిత్ర చెబుతోంది. దాదాపు 300 రకాల పన్నులు. ఈ పన్నులలో పురుషాంతరం అనే పన్ను తీవ్రమైనది. తాతముత్తాతల ఆస్తిలో దాదాపు 40 శాతం విలువైన డబ్బునీ, ధనాన్నీ, సంస్థానానికి అప్పగించాలి. ప్రాయశ్చిత్తం పేరుతో మరోపన్ను. ఎవరైనా ఒక పురుషుడు ఇతర ప్రాంతాలకూ, దేశాలకూ వెళితే పన్ను. ఇల్లు కట్టుకున్నా, గుడిసె వేసుకున్నా పన్ను. చివరకు చెట్లను పెంచితే, ఒక్కొక్క రకం చెట్టుకి ఒక్కొక్క రకం పన్ను విధించేవారు. కొత్త దుస్తులు, నగలూ, తలపాగా ధరించినా, గొడుగుపట్టినా, పెళ్లి ఊరేగింపు జరిపినా పన్ను చెల్లించాల్సిందే. పెళ్లి చేసుకుంటే తాళి పన్ను. ఆవులను, మేకలను, చివరకు కుక్క లాంటి జంతువులను పెంచుకున్నా పశువుల పన్ను. గానుగ ఆడే వారిపైనా పన్ను. ఓడ నడిపే వారికి ఓడ పన్ను, చేపలు పట్టేవారికి వలపన్ను. ఎడ్లబండి పన్ను. గొడ్డలి పన్ను, సుత్తి పన్ను, గునపం పైన కూడా పన్నులు విధించేవారు. వాటి భారంతో ప్రజలు విలవిల్లాడిపోయేవారు. ఘోరమైన విషయం స్త్రీల పైయ్యెదపై ఏ ఆచ్ఛాదనా ఉండకూడదు. ఒకవేళ ఎదపై వస్త్రాన్ని ధరించినట్టయితే పన్నుచెల్లించుకునే దారుణమైన పరిస్థితి. స్త్రీలు అర్థనగ్నంగా మంచినీళ్ల బిందెలను నెత్తిపై పెట్టుకొని తెచ్చుకోవాలి. అలా బిందెను మోసుకొస్తున్నప్పుడు రెండు చేతులూ పైకెత్తి ఉంచాలి. స్తనాల పరిమాణాన్ని బట్టి పన్నులు చెల్లించాల్సి ఉండేది. స్త్రీలు పన్నులు చెల్లించలేని స్థితిలో ఉంటే అధికారికంగా వారి పైన అత్యాచారాలు చేసే నీచమైన పద్ధతులు ఉండేవి. వీటన్నిటిపైనా స్త్రీజాతిలో అంతులేని ఆగ్రహం నిద్రాణమై ఉండేది. పన్నులు చెల్లించకపోతే తీవ్రమైన శిక్షలు అమలు చేసేవారు. అయినా ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను వీరే ఉచితంగా సాగుచేయాలి. పండుగల్లో రాజకుటుంబాలకూ, అధికారులకూ కోళ్లనూ, గుడ్లను, పండ్లను, కూరగాయలనూ, వంటచెరుకునూ అందించాలి. ఆర్థిక ఆంక్షలు, నిషేధాలు, పన్నులు, సామాజిక అణచివేత, అత్యాచారాలు జరుపుతూనే ఆధిపత్య కులాలు వీరిని మతపరంగా వెలివేసినంత పనిచేశాయి. ఆధిపత్య కులాల దేవాలయాల్లో వీరికి ప్రవేశం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించడానికి వీరు అనర్హులు. వాళ్లు ఆధిపత్య కులాల దేవుళ్లు. కింది కులాల కోసం వీరభద్రుడు, సుధాలయ్ మదన్, ఇరులన్, ముత్తురామన్, భద్రకాళి లాంటి దైవాలనే వీరు పూజించాలి. ఇలాంటి నేపథ్యంలోనే 1809లో ఆ సంస్థానంలోని తామరక్కులం గ్రామంలో పొన్ను నాడార్ వెయ్యిలాల్ అమ్మాళ్‌లకు ఒక కొడుకు జన్మిం చాడు. మొదట ముదిచోడుం పెరుమల్గా అతడికి నామకరణం చేశారు. దాని అర్థం కిరీటం ధరించిన ప్రభువు. కానీ ఆధిపత్య కులాలు దానికీ ఆగ్రహించాయి. చివరకు తల్లిదండ్రులు కొడుకు పేరును ముత్తుకుట్టిగా మార్చారు. ముత్తుకుట్టి 22 ఏళ్ళ వరకు సాధారణ జీవితాన్నే గడిపారు. ఇంటి పన్నుల్లో ఇతర వృత్తి పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా నిలబడ్డారు. అప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో ఉండే వైద్యులు, దగ్గరి పట్టణాల్లోని వైద్యులు చేసిన చికిత్సకు ఏం ఫలితం లేకపోయింది. కొందరి సలహా మేరకు తన కొడుకుని తిరుచందూరులోని దేవాలయానికి తల్లి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత దగ్గరి సముద్రంలోనికి ముత్తుకుట్టి పరుగు లంఘించుకున్నాడు. ఎటు వెళ్లాడో తెలి యదు. మూడు రోజుల తర్వాత ముత్తుకుట్టి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దైవాంశతో ఇలా జరిగిందని తల్లిదండ్రులూ, బంధువులూ భావిం చారు. ఆయన తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో ఎంతో మంది ఆరోగ్యాలను మెరుగుపరిచినట్టు ఆయన జీవిత చరిత్రలో ఉంది. సామాజిక పరిశోధకులు ఆయనను మరో రకంగా విశ్లేషించారు. ఆ తరువాత ఆయన పేరు అయ్యావైకుందార్గా మారింది. ప్రజల్లో తన సేవల ద్వారా తన ప్రవచనాల ద్వారా మంచి పేరును సంపాదించారు. అప్పటి వరకు కొనసాగుతున్న అణచివేత, వివక్షలపైన ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. దీనితో ఆధిపత్య కులాలు సంస్థానానికి ఎన్నో ఫిర్యాదులు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నాడని, రాజ్యాన్ని కూలదోయాల్సిందిగా ప్రేరేపిస్తున్నాడని నూరిపోశారు. దీనితో తప్పనిసరై సంస్థానాధీశులు అయ్యావైకుందార్‌ను అరెస్ట్ చేయడానికి సైన్యాన్ని పంపించారు. అయితే వేలాది మంది ప్రజలు అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు. కానీ అయ్యావైకుందార్ ప్రజలకు నచ్చచెప్పడంతో సైన్యానికి దారిచ్చారు. సైన్యం ఆయనను అరెస్టు చేసి, సుచింద్రంలోని రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు ఆయనను పరీక్షించదలచి, మాయలు, తంత్రాలను ప్రదర్శించాని ఆజ్ఞాపించాడు. ఇందుకు అయ్యావైకుందార్ తిరస్కరించారు. దానితో జైలు శిక్ష విధించారు. రెండు రోజుల తర్వాత రాజధాని తిరువనంతపురం తరలించి, మరోసారి పరీక్షించే యత్నం చేసి, విఫలమయ్యారు. సారాలో విషం కలిపి తాగించారు. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇది జరుగుతుండగానే ప్రజలు వేలాదిగా ఆయన ఆశీర్వాదం కోసం తిరువనంతపురం చేరుకోవడంతో రాజు కంగారు పడ్డాడు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో అయ్యావైకుందార్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ వైకుం దార్ అంగీకరించలేదు. తన శిక్షాకాలం దాదాపు 110 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత ఆయన తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. అందులోభాగంగానే ఆయన ‘అఖిలం’ పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. నిత్యం తిరుణాల్ అని (ప్రతి రోజూ పండుగేనని), ప్రత్యేకమైన పండుగల ఆవశ్యకత లేదనీ ప్రకటించాడు. ఈ రోజు అదే సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనీ, తమకూ హిందూ మతానికీ ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. అందుకే అయ్యా వైకుందార్ చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘ఓ భగవంతుడా ఇటు వినండి! నా ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. సంప్రదాయాలూ, కట్టుబాట్లూ మాకు లేవు. మేము దేవాలయాలను నిర్మించం. పూజారులుండరు. మేము ఆవులనూ, మట్టి విగ్రహా లను పూజించం. మేం మేకలనూ, కోళ్ళనూ, గొర్రెలనూ, ఎద్దులనూ, మొత్తంగా పశువులను బలివ్వం. జీవజాతులన్నింటినీ మేం సమంగా ప్రేమిస్తాం.’ మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
అనుబంధ బ్యాంకుల విలీనం ఇప్పుడే కాదు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలించడంలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐకు ఐదు అనుబంధ బ్యాంకులున్నాయి. వీటిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్, ట్రావెన్కోర్, పాటియాలా, మైసూర్‌లతోపాటు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి. విలీన ప్రతిపాదనను ప్రస్తుతం చేపట్టలేదని బీఎస్ఈకి ఎస్బీఐ వెల్లడించింది. అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తాజాగా పరిశీలిస్తామని తెలిపింది. ఇందుకు కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని వివరించింది. ఇకపై మొబైల్ పీవోఎస్: మొబైల్ పాయింట్ ఆఫ్‌సేల్(ఎంపీవోఎస్) ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎస్బీఐ ఈజీటాప్ మొబైల్ సొల్యూషన్స్‌తో జతకట్టింది. తద్వారా స్మార్ట్ఫోన్ల ఆధారంగా ఎంపీవోఎస్కు తెరలేపే యోచనలో ఉంది. రానున్న ఐదేళ్లలో స్మార్ట్ఫోన్ల ద్వారా బిల్ చెల్లింపులకు అవకాశమిచ్చే 5 లక్షల ఎంపీవోఎస్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎస్కే మిశ్రా చెప్పారు.