అనుబంధ బ్యాంకుల విలీనం ఇప్పుడే కాదు: ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలించడంలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఐకు ఐదు అనుబంధ బ్యాంకులున్నాయి. వీటిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్, ట్రావెన్‌కోర్, పాటియాలా, మైసూర్‌లతోపాటు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి. విలీన ప్రతిపాదనను ప్రస్తుతం చేపట్టలేదని బీఎస్‌ఈకి ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తాజాగా పరిశీలిస్తామని తెలిపింది. ఇందుకు కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని వివరించింది.
ఇకపై మొబైల్ పీవోఎస్: మొబైల్ పాయింట్ ఆఫ్‌సేల్(ఎంపీవోఎస్) ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎస్‌బీఐ ఈజీటాప్ మొబైల్ సొల్యూషన్స్‌తో జతకట్టింది. తద్వారా స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా ఎంపీవోఎస్‌కు తెరలేపే యోచనలో ఉంది. రానున్న ఐదేళ్లలో స్మార్ట్‌ఫోన్ల ద్వారా బిల్ చెల్లింపులకు అవకాశమిచ్చే 5 లక్షల ఎంపీవోఎస్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎస్‌కే మిశ్రా చెప్పారు.