శబరిమల స్వామి దర్శనానికి అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు కఠినమైన దీక్ష పూర్తి చేసి భక్తితో వెళ్తారు. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా, శ్రామికుడైనా సరే స్వామి దర్శనం విషయంలో సమానమే... అయితే, మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్‌కు శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇదే సమయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ)పై మండిపడింది.
డిసెంబర్ 4న నటుడు దిలీప్ శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. దీంతో సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై అక్కడి మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురయ్యారని, కొందరైతే దర్శనం కూడా చేసుకోకుండానే వెనుదిరిగారు అంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది.
నటుడు దిలీప్‌ను ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు ప్రశ్నించింది. టీడీబీ చేసిన పొరపాటు వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు వెళ్లడించింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వారే ఇలాంటి తప్పులు చేస్తే.. భక్తులు ఎవరితో చెప్పుకుంటారని తప్పబట్టింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే అక్కడ వీఐపీ దర్శనం ఉంటుందని ఈమేరకు కోర్టు గుర్తుచేసింది. ఇతరులు ఎవరైనా సరే ఆ అవకాశం కల్పించడం విరుద్ధం అంటూ న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment