సంఘర్షణ నేర్పిన సంస్కృతి | Ayyavazhi Tradition History | Sakshi
Sakshi News home page

సంఘర్షణ నేర్పిన సంస్కృతి

Published Thu, May 24 2018 12:51 AM | Last Updated on Thu, May 24 2018 12:51 AM

Ayyavazhi Tradition History - Sakshi

అయ్యావైకుందార్‌

తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్‌ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే.

‘హిందూమతంతో మాకు ఎటువంటి సామ్యం లేదు. మేము హిందువులు అనుసరించే పూజా పద్ధతులనూ, ఇతర విధానాలనూ అనుసరించటంలేదు. మా దైవం, దేవత అంతా దర్పణమే. అంటే అద్దానికే పూజలు చేస్తాం. దేవాలయాల్లో కొబ్బరి కాయలు కూడా కొట్టం. మా వివాహ పద్ధతులు వేరు. మరణం తర్వాత పాటించే సంప్రదాయాలు వేరు. అందువల్లనే మమ్మల్ని వేరే మతంగా ప్రకటించాలని కోరుతున్నాం’ అంటూ ‘అయ్యవాజి’ సామాజిక వర్గం కోరుతున్నది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, కన్యాకుమారిలో ఉన్న ప్రధాన దేవాలయాన్ని సందర్శించిన సమయంలో తాము ఇలా విజ్ఞప్తిని చేశామని, ఆమె సానుకూలంగా స్పందించారని, కానీ ఆమె మృతితో తమ డిమాండ్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ విధంగా మిగిలిందని, అయ్యవాజీల అధిపతి బాలప్రజాపతి అడికల్‌ ఈ మధ్య పత్రికా ప్రతినిధుల ఎదుట వాపోయారు. 

కర్ణాటకలో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత వీరి డిమాండ్‌కు ప్రాధాన్యం పెరి గింది. కానీ ఇది కొత్త డిమాండ్‌ కాదు. అయ్యవాజి సామాజిక వర్గం ఎక్కడిది? ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నలు సందర్భోచితం. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో ఒక సామాజిక ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆ ఉద్యమమే ఆ తర్వాత ఒక జీవన విధానమైంది. ఆ ఉద్యమ వ్యవస్థాపకుడినే భగవంతుడి అవతారంగా పరిగణించారు. ఆనాటి అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటు ఒక మత సంప్రదాయంగా అవతరించింది. ఒక సామాజిక పోరాటం మతంగా రూపుదిద్దుకోవడం ఎలా జరిగిందో ఊహించడానికి ఇదొక ఉదాహరణ. పైగా ఇది ఆధునిక యుగంలో జరగడం విశేషం. 

ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో కులవివక్ష, అణచివేత, అంటరానితనం కింది స్థాయి ప్రజలను ఎన్నో ఇక్కట్లకు గురిచేశాయి. మెజారిటీ కులాలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. ఉద్యోగాల్లో స్థానం లేదు. అగ్రకులాలు నడిచేదారుల్లో నడవడానికి వీలు లేదు. ఇందులో ఎక్కువగా వివక్షకు, అణచివేతకు గురైంది నాడార్‌లే. నాడార్‌ల ప్రధాన వృత్తి కల్లుగీత. వ్యవసాయం ఇతర నిర్మాణ పనుల్లోను వీరి ప్రమేయం ఎక్కువే. వీరి చేత ప్రభుత్వ భవనాలూ, దేవాలయాలూ నిర్మాణం చేయించేవారు. కానీ వేతనాలు లేవు. స్పష్టంగా చెప్పాలంటే వెట్టిచాకిరి. ఇంకా సంస్థానాధీశులు వీరిపైన విపరీతంగా పన్నులు విధించేవారని చరిత్ర చెబుతోంది. దాదాపు 300 రకాల పన్నులు. ఈ పన్నులలో పురుషాంతరం అనే పన్ను తీవ్రమైనది. తాతముత్తాతల ఆస్తిలో దాదాపు 40 శాతం విలువైన డబ్బునీ, ధనాన్నీ, సంస్థానానికి అప్పగించాలి. ప్రాయశ్చిత్తం పేరుతో మరోపన్ను. ఎవరైనా ఒక పురుషుడు ఇతర ప్రాంతాలకూ, దేశాలకూ వెళితే పన్ను. ఇల్లు కట్టుకున్నా, గుడిసె వేసుకున్నా పన్ను. చివరకు చెట్లను పెంచితే, ఒక్కొక్క రకం చెట్టుకి ఒక్కొక్క రకం పన్ను విధించేవారు. కొత్త దుస్తులు, నగలూ, తలపాగా ధరించినా, గొడుగుపట్టినా, పెళ్లి ఊరేగింపు జరిపినా పన్ను చెల్లించాల్సిందే. పెళ్లి చేసుకుంటే తాళి పన్ను. ఆవులను, మేకలను, చివరకు కుక్క లాంటి జంతువులను పెంచుకున్నా పశువుల పన్ను. గానుగ ఆడే వారిపైనా పన్ను. ఓడ నడిపే వారికి ఓడ పన్ను, చేపలు పట్టేవారికి వలపన్ను. ఎడ్లబండి పన్ను. గొడ్డలి పన్ను, సుత్తి పన్ను, గునపం పైన కూడా పన్నులు విధించేవారు. వాటి భారంతో ప్రజలు విలవిల్లాడిపోయేవారు. 

ఘోరమైన విషయం స్త్రీల పైయ్యెదపై ఏ ఆచ్ఛాదనా ఉండకూడదు. ఒకవేళ ఎదపై వస్త్రాన్ని ధరించినట్టయితే పన్నుచెల్లించుకునే దారుణమైన పరిస్థితి. స్త్రీలు అర్థనగ్నంగా మంచినీళ్ల బిందెలను నెత్తిపై పెట్టుకొని తెచ్చుకోవాలి. అలా బిందెను మోసుకొస్తున్నప్పుడు రెండు చేతులూ పైకెత్తి ఉంచాలి. స్తనాల పరిమాణాన్ని బట్టి పన్నులు చెల్లించాల్సి ఉండేది. స్త్రీలు పన్నులు చెల్లించలేని స్థితిలో ఉంటే అధికారికంగా వారి పైన అత్యాచారాలు చేసే నీచమైన పద్ధతులు ఉండేవి. వీటన్నిటిపైనా స్త్రీజాతిలో అంతులేని ఆగ్రహం నిద్రాణమై ఉండేది. పన్నులు చెల్లించకపోతే తీవ్రమైన శిక్షలు అమలు చేసేవారు. అయినా ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను వీరే ఉచితంగా సాగుచేయాలి. పండుగల్లో రాజకుటుంబాలకూ, అధికారులకూ కోళ్లనూ, గుడ్లను, పండ్లను, కూరగాయలనూ, వంటచెరుకునూ అందించాలి. ఆర్థిక ఆంక్షలు, నిషేధాలు, పన్నులు, సామాజిక అణచివేత, అత్యాచారాలు జరుపుతూనే ఆధిపత్య కులాలు వీరిని మతపరంగా వెలివేసినంత పనిచేశాయి. ఆధిపత్య కులాల దేవాలయాల్లో వీరికి ప్రవేశం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించడానికి వీరు అనర్హులు. వాళ్లు ఆధిపత్య కులాల దేవుళ్లు. కింది కులాల కోసం వీరభద్రుడు, సుధాలయ్‌ మదన్, ఇరులన్, ముత్తురామన్, భద్రకాళి లాంటి దైవాలనే వీరు పూజించాలి. 

ఇలాంటి నేపథ్యంలోనే 1809లో ఆ సంస్థానంలోని తామరక్కులం గ్రామంలో పొన్ను నాడార్‌ వెయ్యిలాల్‌ అమ్మాళ్‌లకు ఒక కొడుకు జన్మిం చాడు. మొదట ముదిచోడుం పెరుమల్‌గా అతడికి నామకరణం చేశారు. దాని అర్థం కిరీటం ధరించిన ప్రభువు. కానీ ఆధిపత్య కులాలు దానికీ ఆగ్రహించాయి. చివరకు తల్లిదండ్రులు కొడుకు పేరును ముత్తుకుట్టిగా మార్చారు. ముత్తుకుట్టి 22 ఏళ్ళ వరకు సాధారణ జీవితాన్నే గడిపారు. ఇంటి పన్నుల్లో ఇతర వృత్తి పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా నిలబడ్డారు. అప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో ఉండే వైద్యులు, దగ్గరి పట్టణాల్లోని వైద్యులు చేసిన చికిత్సకు ఏం ఫలితం లేకపోయింది. కొందరి సలహా మేరకు తన కొడుకుని తిరుచందూరులోని దేవాలయానికి తల్లి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత దగ్గరి సముద్రంలోనికి ముత్తుకుట్టి పరుగు లంఘించుకున్నాడు. ఎటు వెళ్లాడో తెలి యదు. మూడు రోజుల తర్వాత ముత్తుకుట్టి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దైవాంశతో ఇలా జరిగిందని తల్లిదండ్రులూ, బంధువులూ భావిం చారు. ఆయన తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో ఎంతో మంది ఆరోగ్యాలను మెరుగుపరిచినట్టు ఆయన జీవిత చరిత్రలో ఉంది. 

సామాజిక పరిశోధకులు ఆయనను మరో రకంగా విశ్లేషించారు. ఆ తరువాత ఆయన పేరు అయ్యావైకుందార్‌గా మారింది. ప్రజల్లో తన సేవల ద్వారా తన ప్రవచనాల ద్వారా మంచి పేరును సంపాదించారు. అప్పటి వరకు కొనసాగుతున్న అణచివేత, వివక్షలపైన ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. దీనితో ఆధిపత్య కులాలు సంస్థానానికి ఎన్నో ఫిర్యాదులు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నాడని, రాజ్యాన్ని కూలదోయాల్సిందిగా ప్రేరేపిస్తున్నాడని నూరిపోశారు. దీనితో తప్పనిసరై సంస్థానాధీశులు అయ్యావైకుందార్‌ను అరెస్ట్‌ చేయడానికి సైన్యాన్ని పంపించారు. అయితే వేలాది మంది ప్రజలు అరెస్ట్‌ చేయడానికి వీలు లేదంటూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు. కానీ అయ్యావైకుందార్‌ ప్రజలకు నచ్చచెప్పడంతో సైన్యానికి దారిచ్చారు. సైన్యం ఆయనను అరెస్టు చేసి, సుచింద్రంలోని రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు ఆయనను పరీక్షించదలచి, మాయలు, తంత్రాలను ప్రదర్శించాని ఆజ్ఞాపించాడు. ఇందుకు అయ్యావైకుందార్‌ తిరస్కరించారు. దానితో జైలు శిక్ష విధించారు. రెండు రోజుల తర్వాత రాజధాని తిరువనంతపురం తరలించి, మరోసారి పరీక్షించే యత్నం చేసి, విఫలమయ్యారు. సారాలో విషం కలిపి తాగించారు. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇది జరుగుతుండగానే ప్రజలు వేలాదిగా ఆయన ఆశీర్వాదం కోసం తిరువనంతపురం చేరుకోవడంతో రాజు కంగారు పడ్డాడు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో అయ్యావైకుందార్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ వైకుం దార్‌ అంగీకరించలేదు. తన శిక్షాకాలం దాదాపు 110 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. 

ఆ తరువాత ఆయన తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్‌ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. అందులోభాగంగానే ఆయన ‘అఖిలం’ పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. నిత్యం తిరుణాల్‌ అని (ప్రతి రోజూ పండుగేనని), ప్రత్యేకమైన పండుగల ఆవశ్యకత లేదనీ ప్రకటించాడు. ఈ రోజు అదే సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనీ, తమకూ హిందూ మతానికీ ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. అందుకే అయ్యా వైకుందార్‌ చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘ఓ భగవంతుడా ఇటు వినండి! నా ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. సంప్రదాయాలూ, కట్టుబాట్లూ మాకు లేవు. మేము దేవాలయాలను నిర్మించం. పూజారులుండరు. మేము ఆవులనూ, మట్టి విగ్రహా లను పూజించం. మేం మేకలనూ, కోళ్ళనూ, గొర్రెలనూ, ఎద్దులనూ, మొత్తంగా పశువులను బలివ్వం. జీవజాతులన్నింటినీ మేం సమంగా ప్రేమిస్తాం.’


మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213  
 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement