శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్‌లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు.
ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది.
ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్‌కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు.
నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే.
వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట.
ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు.
-వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి
Comments
Please login to add a commentAdd a comment