
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి?
– జాగృతి, కర్నూలు.
గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్‌గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు.
ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది.
న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్‌లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.
నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి?
– మమత, హైదరాబాద్.
ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్‌లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది.
శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్‌ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి.
తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి.
నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి?
– కీర్తి, నల్గొండ.
చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్‌లాగా వస్తుంది.
ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్‌గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది.
ఐరన్, కాల్షియం వంటి మినరల్స్‌ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
(చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!)