మెటర్నిటీ షూట్
ప్రీ వెడ్డింగ్ షూట్ వెడ్డింగ్ షూట్ తెలిసిందే. కాని ఇప్పుడు మెటర్నిటీ షూట్ ట్రెండ్‌లో ఉంది. స్త్రీలు తమ నిండు గర్భం సమయంలో భర్తతో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొనడం ఒక ముఖ్య ఉత్సవంగా మారింది. తాజాగా దీపికా పడుకోన్ విడుదల చేసిన మెటర్నిటీ షూట్ ఫొటోలు ఈ ట్రెండ్ గురించి ప్రొత్సాహంగా మాట్లాడుతున్నాయి.
తొలి చూలుతో పుట్టింటికి వచ్చిన కూతురు రేపో మాపో కాన్పు అవుతుందనగా ‘నొప్పులొస్తే నన్ను లేపమ్మా’ అందట నిద్రపోతూ. అప్పుడు తల్లి నవ్వుతూ ‘పిచ్చిపిల్లా... నొప్పులొస్తుంటే నేను నిన్ను లేపడం కాదే. నువ్వే గోల చేసి ఊరంతా లేపుతావు’ అందట. మాతృత్వపు మధురిమ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. గర్భం దాల్చడంతో మొదలు నెలలు నిండుతూ వెళ్లడం, శరీరంలో మార్పు ఉదర భాగం బిడ్డకు గూడుగా మారుతూ ఎదుగుతూ ఉండటం, ఆ మార్పులన్నీ చూసుకోవడం, చివరకు కాన్పు జరిగి అంతవరకూ గర్భంలో ఉన్న బిడ్డ ఒడికి చేరడం... స్త్రీకి ఇదంతా అద్భుత ఘట్టం. మానసిక శాస్త్ర అధ్యయనం ప్రకారం చాలామంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు ఆ నిండుదనాన్ని నలుగురికీ చెప్పుకోవాలని ఉంటుందట. నిండు గర్భంతో అప్పుడప్పుడు నలుగురిలోకి రావడాన్ని ఇష్టపడతారట. కాలక్రమంలో ఈ ఇష్టం ఆ క్షణాలను ఫొటోలుగా దాచుకునే వరకూ వచ్చింది.
1991లో మొదలైన ట్రెండ్
హాలీవుడ్ ప్రసిద్ధ నటి డెమి మూర్ 1991లో తన ఏడు నెలల గర్భాన్ని ప్రదర్శిస్తూ ఒక మేగజీన్ కవర్ పేజీ మీద కనపడినప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం అయ్యింది. ప్రఖ్యాత మహిళా ఫొటోగ్రాఫర్ ఆనీ లీబోవిజ్ ఈ ఫొటో తీసింది. చాలామంది దీనిని స్త్రీ శరీర ధర్మానికి సంబంధించిన ఒక గౌరవ ప్రకటనగా భావిస్తే మరికొందరు ఇందులో అశ్లీలత ఉందని విమర్శలు చేశారు. అయితే కాలక్రమంలో సెలబ్రిటీలు చాలా మంది మెటర్నిటీ ఫొటోస్‌ను జనం ముందుకు తీసుకురాసాగారు.
2012 నుంచి ఇండియాలో
మన దేశంలో బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు మెటర్నిటీ షూట్‌ను 2010 నుంచి పరిచయం చేయసాగారు. కొంకణా సేన్, సోహా అలీ ఖాన్, నేహా ధూపియా, బిపాషా బసు, అనుష్కా శర్మ, కరీనా కపూర్, సోనమ్ కపూర్, ఇటీవల ఆలియా భట్... వీళ్ల ఫొటోషూట్‌లు సామాన్యజనానికి కుతూహలం రేకెత్తించాయి. మనం కూడా ఎందుకు ఇలాంటి జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకోకూడదు అనిపించేలా చేశాయి. ఇప్పుడు దీపికా పడుకోన్ తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి బ్లాక్ అండ్ వైట్‌లో చేసిన మెటర్నిటీ షూట్ అందరి చేత ప్రశంసలు పొందుతోంది. రెండు ఫ్యాషన్ బ్రాండ్‌ల నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న దుస్తులతో దీపిక ఈ షూట్ చేసింది. రణ్‌వీర్ సింగ్ ఈ షూట్‌లో సంబరంగా పాల్గొన్నాడు.
మధ్యతరగతికి దూరం కాదు
మెటర్నిటీ షూట్‌లకు సెలబ్రిటీలు లక్షలు ఖర్చు పెడుతుంటే మధ్యతరగతి స్త్రీలకు అదేమీ అందని కల కాదు. ్ర΄÷ఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లతో మొదలు హాబీగా ఫొటోలు తీసేవారి వరకూ ఇలాంటి ఫొటోలు తీసి పెట్టేవారు ఉన్నారు. నాలుగు గంటల వ్యవధిలో మూడు రకాల డ్రస్సులతో ఫొటోలు తీసి పెట్టే ΄్యాకేజీలు కూడా ఉన్నాయి. ‘ఒకప్పుడు గర్భిణులు కెమెరా ముందుకు రావడానికి సిగ్గు పడేవారు. కాని తమ మాతృత్వ దశలను పదిలం చేసుకునేందుకు ఇప్పుడు సంతోషంగా ముందుకొస్తున్నారు’ అని ఇలాంటి ఫొటోలు తీసే ఒక ఫొటోగ్రాఫర్ అన్నారు.
థీమ్ ఫొటోలు
ప్రెగ్నెన్సీ షూట్‌లో కూడా థీమ్స్ ఉన్నాయి. పల్లెటూరి జంటలుగా, నగర శ్రీమంతులుగా, గుడి ్రపాంగణంలో, తెలుగుదనంతో ఇలా చాలా రకాలున్నాయి. ఎనిమిదవ నెలలో ఈ ఫొటోషూట్ చేయించుకుంటే ఫొటోలు బాగావస్తాయంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం. మీ మనసులో ఈ ముచ్చట ఉంటే వెంటనే అందుకు సిద్ధం కండి.
Comments
Please login to add a commentAdd a comment