కాబోయే అమ్మలకు
టీకాపలా!
గర్భవతులు తమ ఆరోగ్యం కోసం కొన్ని, తమకు పుట్టబోయే చిన్నారి ఆరోగ్యం కోసం మరికొన్ని వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. అయితే గర్భం రాకముందు కూడా కొన్ని వ్యాక్సిన్లు వేసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఇంకొన్ని వ్యాక్సిన్లు తీసుకోవాల్సి రావచ్చు. గర్భం కోసం ప్లాన్ చేసుకునే మహిళలు, ఆపై గర్భం ధరించాక గర్భవతులు... ఇలా మహిళందరూ తాము తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలుసుకోడానికి ఉపయోగపడే కథనం ఇది.
గర్భవతినని తెలియగానే ఆమె తనకు వచ్చేందుకు అవకాశమున్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి.
గర్భిణులు తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌లు ఇవి...
టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్: టెటనస్ వచ్చిన బాధితుల్లో కండరాలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడి, అది శ్వాస సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇక ‘కోరింత దగ్గు’ అని పిలిచే పెర్టుసిస్ అనే వ్యాధితోపాటు పైన పేర్కొన్న మరో రెండు.. అన్నీ కలిసి మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి. సంక్షిప్తంగా ‘టీ–డాప్’ అని పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు దీన్ని తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి సైతం ఆ వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభించే అవకాశం ఉంటుంది.
ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్: గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. నిజానికి కేవలం గర్భవతులే కాదు... ప్రజలందరూ తీసుకోవడం మంచిదే. అయితే గర్భవతుల్లో ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ప్రతి సీజన్‌లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులైతే మరింత తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ప్రభావంపై అధ్యయనాలు పెద్దగా లేవు.
పైగా గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకునే ఈ వ్యాక్సిన్ బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ రక్షణ ఇస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్‌వైరస్‌తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం పీల్చే వ్యాక్సిన్‌ను అస్సలు వాడకూడదు.
గర్భం దాల్చడానికి ముందుగానే తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు...
గర్భం దాల్చాలనుకున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను తప్పక తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత తీసుకుంటే ఈ వ్యాక్సిన్లు గర్భవతికి ప్రమాదకరంగా పరణమించవచ్చు. అందుకే వీటిని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే తీసుకోవాలి.
ఒకవేళ వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) పెద్దగా లేని గర్భవతికీ లేదా ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉన్న మహిళలకు ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకారులు కావచ్చు. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... మరీ చె΄్పాలంటే... ఇంకా గర్భం దాల్చక ముందే తీసుకోవడం మంచిది. (ఈ వ్యాక్సిన్లను రొటీన్ వ్యాక్సినేషన్‌లో భాగంగానే ఇస్తారు. ఒకవేళ అలా తీసుకోనివారు తప్పక ఈ వ్యాక్సిన్లు తీసుకోవాలి).
ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్‌ఎమ్‌ఆర్) వ్యాక్సిన్‌ను బాల్యంలో తమ రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే ఆ విషయాన్ని తమ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా ఆ వ్యక్తి ఎమ్‌ఎమ్‌ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అని తెలుసుకుంటారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్‌ఎమ్‌ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భందాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో ఆ వ్యాధులు (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) సోకితే గర్భస్రావం అయ్యే అవకాశాలూ ఉంటాయి.
ఒకవేళ రుబెల్లా వైరస్ గానీ అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకిందంటే... అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అర్లీ ప్రెగ్నెన్సీలో కాకుండా... రెండో త్రైమాసికం తర్వాతగానీ ఇవే ఇన్ఫెక్షన్లు సోకినా అవి బిడ్డపై అవి పెద్దగా ప్రభావం చూపవు.
వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్ గర్భవతికి సోకవం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. కాబట్టి గర్భం దాల్చాలనుకునేవారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోడానికి నెల్లాళ్ల ముందే దాన్ని తీసుకోవడం మేలు.
హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిజానికి ఈ వైరస్‌ను యాక్టివ్ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే తీసుకుంటే దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ సైతం నివారితమవుతుంది.
గర్భిణికి ఇవ్వకూడని వ్యాక్సిన్...
జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్. కాబట్టి దీన్ని గర్భం దాల్చినవారికి ఇవ్వరు. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి ఆస్కారం ఉండదు. ఇవీ... గర్భవతులు, గర్భం దాల్చాలనుకునే వారితో పాటు ఇతర మహిళలూ తెలుసుకోవాల్సిన వ్యాక్సిన్లు, వాటి గురించి వివరాలు.
Comments
Please login to add a commentAdd a comment