
– రామజోగయ్య శాస్త్రి
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.
పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి.
వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది.
యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు.
అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు.
యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు.
ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు.
ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.

పండగ‘రుచి’చూపాలి
– అనంత శ్రీరామ్
పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి.
కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే.
ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు.
ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.
ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది.
వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.
– డి.జి. భవాని