
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.
దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.
ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్‌లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు