
విశ్లేషణ
పహల్‌గామ్‌లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.
భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది.
అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.
కేవలం నిలిపేసింది!
భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది.
అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్‌లెట్‌లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది.
ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.
అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది.
ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.
ఎలా దాడి చేయొచ్చు?
కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం.
అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.
కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం.
ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.
ముక్కలుగా కత్తిరిస్తే!
భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు.
కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్‌ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం.
కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.
చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.
అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్‌లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.
తారా కార్థా
వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)