
విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలవల్ల ఆ దేశానికి జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏమిటి? స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవటమా? బాండ్స్ మార్కెట్ దెబ్బ తినటమా? డాలర్ విలువ తగ్గుతుండటమా? ఇవేవీ కావు. అన్నింటికన్న ముఖ్యమైనది విశ్వసనీయతకు కలుగుతున్న నష్టం. స్టాక్స్‌ను, బాండ్లను, కరెన్సీ విలువను దిద్దుబాటు చర్యలతో పునరుద్ధరించుకోవచ్చు. కానీ విశ్వసనీయత (credibility) మౌలికమైనది. అది ఒకసారి దెబ్బతినటం మొదలైతే కోలుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అమెరికాకు ఇది అన్నింటికి మించిన నష్టమవుతున్నది. మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతానికి దోహదపడుతున్నది. ఇది అమెరికా (America) కోరుకోని ఫలితం.
డాలర్ బాండ్ల సంక్షోభం
దీనంతటికీ ఆరంభం దిగుమతి సుంకాలను ఒకేసారి 184 దేశాలపై హెచ్చించటమన్నది తెలిసిందే. సుంకాల చెల్లింపులు గతంలోనూ ఉన్నవే. అమెరికాయే గాక ఇతరులూ అప్పుడప్పుడు చేస్తుండినవే. ట్రంప్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఒకేసారి అందరిపై ఒకే విధంగా అన్ని సరకులపై 10 శాతం పెంచి, కొద్ది రోజుల తర్వాత ఆ యా దేశాలతో వాణిజ్య లోటు అనే మొత్తాలపై 50 శాతం పెంచారు. కానీ బాండ్ల మార్కెట్‌కు, డాలర్ విలువకు నష్టాలు మొదలు కావటం జరిగింది. ఆ మాట ఆయన బహిరంగంగానే అంగీకరిస్తూ, 50 శాతం సుంకాల హెచ్చింపును అమలుకు తెచ్చిన కొద్ది గంటలలోనే ఆ చర్యను 90 రోజులపాటు వాయిదా వేయవలసి వచ్చింది.
ఇందులో బాండ్ల మార్కెట్ నష్టాలు అతి తీవ్ర మైనవి కావటం ఎందుకంటే, అమెరికన్ డాలర్ విలువ అతి సుస్థిరమైనదనీ, డాలర్ బాండ్లు కొన్న ట్లయితే తమ డబ్బుకు లభించే వడ్డీ ఆదాయం, దీర్ఘకాలిక భద్రత సురక్షితమనీ నమ్మేవారు ప్రపంచం అంతటి నుంచీ డాలర్ బాండ్లలో మదుపు చేస్తారు. ఆ విధంగా చైనా సైతం ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా బాండ్లు ఖరీదు చేసిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇపుడు ట్రంప్ ధోరణితో డాలర్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసం దెబ్బతింటుండటంతో సామాన్య ప్రజల నుంచి ఆయా దేశాల వరకు ఆ బాండ్లను అమ్మడం మొదలైంది.
అమెరికాకు అతి సన్నిహితమైన జపాన్ (Japan) ప్రభుత్వం సైతం వందలాది బిలియన్ల బాండ్లు సత్వరంగా విక్రయించిందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. మరొకవైపు కొత్త బాండ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ ధోరణి కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికితోడు డాలర్ విలువ (Dollar Value) తగ్గుదల సరేసరి. ఈ పరిణామాల కారణంగానే సుంకాలను 90 రోజులు వాయిదా వేయక తప్పలేదు. అంత చేసినా విశ్వసనీయతకు నష్టం జరగనే జరిగింది.
లొంగని చైనా
సుంకాలకు బెదిరి అమెరికాతో చర్చలకు కొన్ని దేశాలు సిద్ధపడటం నిజమే అయినా – కెనడా, యూరప్, చైనా (China) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు అందుకు నిరాకరిస్తూ ఎదురు సుంకాలు విధించటం, అమెరికాకు అవసరమైన కీలకమైన ముడిసరకుల రవాణాను నిలిపివేయటం మొదలుపెట్టాయి. ఇది కూడా అమెరికన్ స్టాక్స్‌ను, బాండ్ల మార్కెట్‌ను, డాలర్ విలువను, ప్రజల నిత్యావసర సరకుల ధరలను ప్రభావితం చేయటం మొదలైంది.
తమకు అన్నివిధాలా సవాలుగా మారిన చైనాను ఆర్థికంగా, ఇతరత్రా కూడా కట్టడి చేసేందుకు రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రభుత్వాలు రెండూ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఆ విధానాలు ఇప్పుడు ట్రంప్ రెండవ హయాంలో పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీనంతటి నిజమైన ఉద్దేశం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కన్నా తమను దీర్ఘకాలం పాటు దెబ్బతీయటమే అని భావిస్తున్న చైనా, ఎన్ని నష్టాలనైనా భరిస్తాముగానీ ఎటువంటి ఒత్తిడికైనా లొంగబోమని, చివరికంటా పోరాడుతామని ఒకటికి నాలుగు సార్లు స్పష్టం చేసింది.
పేరు మోసిన ఆర్థిక నిపుణులంతా ట్రంప్ బృందానికి ఆర్థిక విషయాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిస్తుండటం కూడా అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన దౌత్యనీతి ఛాయలు కనిపించటం మొదలైంది. అమెరికన్ మీడియా (American Media) వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: ట్రంప్ అధికారులు చైనా అధికారులకు ఫోన్ చేసి, తాము పెంచిన సుంకాలకు పోటీగా చైనా ఇక పెంచవద్దనీ, అది చైనాకే నష్టదాయకమనీ కోరారు. కానీ చైనా ఆ మాటను లెక్కచేయక మరిన్ని సుంకాలు పెంచింది. ఆ వెనుక ట్రంప్ అధికారులు మరొకసారి చైనా అధికారులకు ఫోన్ చేసి, ఒకసారి జిన్‌పింగ్ (Xi Jinping) చేత ట్రంప్‌తో మాట్లాడించమని కోరారు. అందుకు చైనా అధ్యక్షుడు నిరాకరించారు.
మరొకవైపు అమెరికా నష్టాలు కొనసాగటం, సుంకాలను 90 రోజులు వాయిదా వేసినా మార్కెట్లకు నమ్మకం ఏర్పడక ఒక రోజు విరామం తర్వాత తిరిగి పతనమవుతుండటం, బాండ్ల సమస్య, ఉత్పత్తులకు కొరతలు, ధరల పెరుగుదలలు కొనసాగటంతో పరిస్థితి అర్థమైంది. దానితో, సుంకాలు పెంచిన ఈ నెల 2వ తేదీ నుంచి సరిగా 10 రోజులు గడిచి 12వ తేదీ వచ్చేసరికి, చైనా నుంచిదిగుమతి అయ్యే సెల్‌ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సామగ్రిపై సుంకాల పెరుగుదలను ట్రంప్ నిలిపి వేశారు.
చదవండి: ట్రంప్ సుంకాల సంక్షోభం.. అనూహ్య పరిణామాలు
ఇదిట్లుండగా, తన కొత్త విధానాల వల్ల అమెరికన్, తదితర పరిశ్రమలు అమెరికాకు తరలి రాగలవనే ట్రంప్ ఆశాభావానికి ఎవరి నుంచీ సుముఖత కనిపించటం లేదు. చట్టబద్ధత లేని వలస కార్మికులను పారదోలటంతో వ్యవసాయం, హోటళ్ల వంటి రంగాలు దెబ్బ తింటుండటంతో, వారి కొనసాగుదలకు యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నది ఇదే 12వ తేదీ నాటి మరో ఉత్తర్వు. పోతే, విద్యా వైద్య రంగాలలో కుదింపులు, విదేశీ సహాయాల (యూఎస్ ఎయిడ్ ద్వారా) రద్దు పేద దేశాలల్లో కలిగిస్తున్న హాని, ఆగని గాజా మారణకాండ వంటి ఇతర అనేక చర్యలు కూడా ట్రంప్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది వారికి ఆర్థికానికి మించిన దీర్ఘకాలిక నష్టం.
- టంకశాల అశోక్
సీనియర్ సంపాదకుడు