ఇదొక అరుదైన వ్యాధి | Sakshi Guest Column On rare disease of Zakir Hussain | Sakshi

ఇదొక అరుదైన వ్యాధి

Published Wed, Dec 25 2024 1:14 AM | Last Updated on Wed, Dec 25 2024 1:14 AM

Sakshi Guest Column On rare disease of Zakir Hussain

ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకిర్‌ హుస్సేన్‌ డిసెంబర్‌ 15న మరణించారు. ఇందుకు కారణమైన వ్యాధి చాలా అరుదైనది. దాని పేరు ‘ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌’ (ఐపీఎఫ్‌). ఇడియోతిక్‌ వ్యాధులంటే...  కారణం తెలియని వ్యాధులు అని అర్థం. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కారణం తెలియని వ్యాధులు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.

మానవ దేహంలో ఊపిరితిత్తులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఊపిరితిత్తులు కొన్ని లక్షల గాలి సంచులు లేదా వాయు గోళాల (అల్వియోలై)తో నిర్మితమై ఉంటాయి. వాయు గోళాలు ఆక్సిజన్‌/ కార్బన్‌ డై యాక్సైడ్‌ పరస్పర మార్పిడి కేంద్రాలు. ఐపీఎఫ్‌ వ్యాధిలో వాయుగోళాలూ, వాటి చుట్టూ ఉండే కణజాలాలూ మందంగా తయారై బిగుసుగా తయార వుతాయి. 

మృదువుగా ఉండే కణజాలాలు మందబడటం (స్కారింగ్‌/ ఫైబ్రోసిస్‌/ మచ్చలు బారడం) వల్ల అవి వాయు మార్పిడి సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీని మూలంగా శరీరానికి కావల్సినంత ఆక్సిజన్‌ సరఫరా జరుగదు. ఈ పరిస్థితి క్రమేణా మరింత పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తగ్గుతుంది. అవసరమైన స్థాయిలో శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆక్సిజన్‌ సరిపడా అందనపుడు శరీరంలో వివిధ అవయవాలు తమ విధులు నిర్వర్తించలేవు. 

ఈ వ్యాధి లక్షలో 20 మందికి వచ్చే అవకాశం ఉంది. దీనిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాలు కనిపించినప్పటి నుండి వ్యాధిని గుర్తించేందుకు ఒకటి నుండి మూడు సంవత్సరాలు పడుతుంది. టీబీ, ఐపీఎఫ్‌ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల వ్యాధిని నిర్ధారించడం సంక్లిష్టం. 

ధూమ పానం చేసే వారిలో, గతంలో ధూమ పానం అలవాటు ఉన్నవారిలో, 50 ఏళ్ల వయసు దాటిన వారిలో, గతంలో కుటుంబంలో ఎవరికయినా ఈ వ్యాధి సోకిన వారిలో ఐపీఎఫ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో; లోహ, కలప ధూళి వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. వైరల్‌ ఇన్ఫెక్షన్, జీర్ణకోశ వ్యాధుల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు.

శ్వాసలో ఇబ్బంది, పొడి దగ్గు, ఆయాసం, ఆకస్మికంగా బరువు కోల్పోవడం, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, చేతి మరియు కాలి వేళ్ళు గుండ్రంగా మారడం, ఆకలి మందగించడం, ఉమ్మిలో తెమడ, దగ్గినప్పుడు రక్తం పడటం, ఛాతీలో నొప్పి, గురక వంటి లక్షణాలు క్రమేణా పెరిగి శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. రోజు వారీ పనులు కూడా నిర్వర్తించలేని స్థితి వస్తుంది. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. రెండు వారాల కన్నా ఎక్కువగా పై లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఊపిరితిత్తుల సీటీ స్కాన్, రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, నడక సామర్థ్య పరీక్ష, బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. వివిధ రకాల ఔషధాలు ప్రయోగాత్మకంగా వాడుతున్నప్పటికీ కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులో లేదు. కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు. అరుదైన కేసులలో ఊపిరితిత్తుల మార్పిడి చేస్తారు. 
– డా‘‘ అనుమాండ్ల వేణుగోపాల రెడ్డి ‘ 99481 06198 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement