కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్‌ పార్టీ | Canada Election Results Mark Carney Liberals Lead First Polls | Sakshi
Sakshi News home page

కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్‌ పార్టీ

Published Tue, Apr 29 2025 7:07 AM | Last Updated on Tue, Apr 29 2025 8:55 AM

Canada Election Results Mark Carney Liberals Lead First Polls

అ‍ట్టావా: కెనడా (Canada)లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కెనడాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ కూడా గట్టి పోటీనిస్తోంది.

ఇక, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. లిబరల్‌ పార్టీ 59 స్థానాల్లో గెలుపొందగా.. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, కన్జర్వేటివ్‌ పార్టీ 56 స్థానాలు దక్కించుకొని.. మరో 76 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్‌ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, కెనడా (Canada) పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 28న పోలింగ్‌ జరగగా.. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి.

కెనడాలో నాలుగు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వాటిలో లిబరల్ పార్టీ (Liberal party), కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party), న్యూ డెమోక్రాట్స్ (NDP), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. రెండుసార్లు సెంట్రల్ బ్యాంకులకు గవర్నర్‌గా పనిచేసిన మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చి మధ్యలో కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. జనవరిలో మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కెనడాలో అనేకమంది రాజకీయనాయకులు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కెనడాలో ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.

మరోవైపు.. అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్‌తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement