
ఏప్రిల్ 22న ఆకాశంలో కనువిందు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది.
ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్‌గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు.
ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్‌ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్