
రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.
తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం‍్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.
జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు.