
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.
ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్‌లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..).
అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN
— News18 (@CNNnews18) March 7, 2025
VIDEO CREDITS: News18